
అమరావతికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మే 2న ప్రధాని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రానున్నట్లు అధికారవర్గాల నుంచి వస్తున్న సమాచారం. బహిరంగ సభ కోసం ఏపీ సెక్రటేరియట్ సమీపంలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 100 ఎకరాల వరకు పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు.
మోదీ హెలిప్యాడ్‌ను ఏపీ సచివాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని వచ్చిన తర్వాత.. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్‌పై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్‌తో కలిసి ర్యాలీగా సభప్రాంగణానికి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఈక్రమంలో దారిపొడవునా అమరావతి మహిళా రైతులు సుమారు 30 వేల మందితో ప్రధానికి పూలతో వెల్‌కమ్ చెప్పాలని అనుకున్నారు. కానీ జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధాని భద్రత దృష్ట్యా ఆ కార్యక్రమం వద్ద కేంద్ర నిఘా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి.
రోడ్ షో రద్దైనప్పటికీ మిగిలిన కార్యక్రమాలు హైలెట్‌గా చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలించాలని చూస్తోంది. సుమారు 5 నుంచి 6 లక్షల మంది వరకు జనసమీకరణ చేపట్టాలని మంత్రులు, నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సుమారు 2500 వరకు జన సమీకరణకు వినియోగించాలని నిర్ణయించారు. ఇక లారీలు, ప్రైవేటు వాహనాలు భారీగా ఆయా నియోజకవర్గాల నుంచి ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 5 నుంచి 10 వేల మంది జనాభా తరలించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ జిల్లాల నుంచే అధికంగా..
రాజధాని అమరావతి ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచే 90 శాతం జనాభా వస్తారని నాయకులు చెబుతున్నారు. సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి సమావేశం అయ్యారు. కృష్ణా జిల్లా నుంచి లక్ష మంది ప్రధాని సభలో పాల్గొనాలని మంత్రులు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చూసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని సభకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే 2 నుంచి 3 లక్షల మంది జనం వచ్చేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి కూడా భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మిగిలిన జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. అందుకు తగ్గట్లు వైద్య, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మే 2న సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సభకు ప్రజలు చేరుకునేందుకు మొత్తం 7 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గాల నుంచి ప్రజలు రావాలని, పోలీసులు, అధికారులు అందుకు సహకరించాలని మంత్రుల కమిటీ సూచించింది.