
అమరావతి : తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎప్పుడూలేని విధంగా వర్షాకాలం ఆరంభంలోనే వర్షాలు దంచికొట్టడంతో వరదనీటితో నదుల్లో ప్రవాహం రికార్డుస్థాయికి చేరుకుంది. గత వందేళ్లను ఎన్నడూలేని విధంగా జూలై ఆరంభంలోనే గోదావరిలో నీటిమట్టం రికార్డ్ స్థాయికి చేరుకుంది. అటు భద్రాచలం నుండి ఇటు పోలవరం ప్రాజెక్ట్ వరకు గోదావరి మహోగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది.
పాపికొండల మధ్యలో వంపులు తిరుగుతూ ఆహ్లాదంగా ప్రవహించే గోదావరి ప్రస్తుతం వరదనీటితో ఉప్పొంగుతోంది. దీంతో ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ జలదిగ్బంధం అయ్యింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరదనీరు గోదావరిలోకి భారీగా చేరుకుంటోంది. దీంతో ఎప్పటికప్పుడు ప్రవాహ తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ కు వస్తున్న 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తిఉంచారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నానికి వరద ప్రవాహం మరింత పెరిగి 12 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
Video భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం... పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఇదీ పరిస్థితి...
గోదావరి నదిలో గంటగంటలకు వరద ప్రవాహ ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం 32.2మీటర్ల చేరుకుంది. గంటకు 35 సెంమీ చొప్పున నీటిమట్టి పెరుగుతున్నట్లు సమాచారం. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం అనూహ్యంగా పెరుగుతోంది. ఇలా పోలవరం ప్రాజెక్ట్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా వరదనీరు చేరుతోంది. జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది.
గతంలో జూలై మాసంలో కేవలం 30 నుండి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే పోలవరంకు వచ్చేది. కానీ ఈసారి అనూహ్యంగా 10లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతోంది. ఈ పరిణామాలను ఊహించని అధికారులు ముందస్తు ప్రణాళికలేవీ చేపట్టకపోవడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం 19.5మీటర్లుగా వుంది. అర్దరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ ఢ్యాం,గ్యాప్-2పనులు పూర్తిగా నిలిచిపోయాయి,
ఇదిలావుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇన్ ప్లో 26,848 క్యూసెక్కులు కాగా 4,948 క్యూసెక్కుల నీటిని కాలువలకు, మిగతా 21,900 క్యూసెక్కుల సర్ ప్లస్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఈ నీటిని వదులుతున్నారు అధికారులు.
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48.60 అడుగులకు చేరింది. 11,39,230 క్యూసెక్స్ నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.