
వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీసు స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. దళిత యువకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 5న గోపాలపురంలో ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లో డిస్పోజబుల్ ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రం ఉండటం, వాటిని వియోగించి చెత్త బుట్టలో పడేయడంపై వివాదం తలెత్తింది. దీనిపై ఆందోళనకు దిగిన దళిత యువకులు ఆందోళనకు దిగారు. ఈ వివాదానికి సంబంధించి హోటల్ యజమాని, ప్లేట్లు విక్రయించిన వ్యక్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్సీ కమిషన్ విచారణ చేస్తోంది.
ఇక, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జగ్గిరెడ్డి.. ఆదివారం సాయంత్రం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. రావులపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి ఎస్సై చాంబర్ వద్ద బైఠాయించారు. దళితులపై కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి రావులపాలెం పీఎస్‌లోనే జగ్గిరెడ్డి నిరసన చేపట్టారు. రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారందరిపై చర్యలు తీసుకునే వరకు పోలీస్ స్టేషన్ లొనే ఉంటానని చెప్పారు.
ఈ క్రమంలోనే జగ్గిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అమలాపురం ఎంపీ అనురాధ కూడా రావులపాలెం పోలీసు స్టేషన్‌కు చేరుకుని జగ్గిరెడ్డితో మాట్లాడారు.