తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు: ఉప్పొంగుతున్న గోదావరి.. వణుకుతున్న కొనసీమ

By Siva KodatiFirst Published Aug 15, 2020, 5:28 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొనసీమలో గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరడంతో ఉద్ధృతి పెరిగింది.

ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్టో, ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులుగా వుందని అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Also Read:గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం పంప్ హౌస్ మోటార్లు నిలిపివేత

మరోవైపు పి గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి పెదపూడి సహా పలు  లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

వైనతేయ నది పొంగిపోర్లుతుండటంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలోని గండిపోచమ్మ ఆలయంలోకి భారీగా వరదనీరు చేరింది.

Also Read:బస్వపూర్ వాగు లో చిక్కుకున్న లారీ డ్రైవర్ ను కాపాడేందుకు వచ్చిన హెలికాప్టర్

రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువైంది.

కొత్తూరు కాజ్‌వే వద్ద పది అడుగుల మేర వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

click me!