కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మరోసారి భారీగా వరద.. ప్రాజెక్టుల వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 10:34 AM IST
Highlights

కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులలోకి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో.. తాజాగా వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులలోకి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో.. తాజాగా వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జురాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్‌ వే ద్వారా 2.51 లక్షల క్యూసెక్కులు సాగర్ వైపు విడుదల చేస్తున్నారు. 

డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రస్తుతం 214. 84 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి చేసి 62,404 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికే 20 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 3,14,293 క్యూసెక్కులు కాగా..  ఔట్‎ఫ్లో 3,37,961 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 309.9 టీఎంసీలుగా ఉంది.

పులిచింత ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన సాగర్ నుంచి 3.31 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 14 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతుంది. బ్యారేజీకి 1.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈరోజు రాత్రిలోపు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముంపుకు గురికాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. 

నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి.. 
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు బుధవారం సాయంత్రం గండిపడింది. క్రమంగా గండి పెద్దది కావడంతో నీటి ఉధృతికి నిడమనూరు మండల కేంద్రంతోపాటు నర్సింహుగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు ఏడు అడుగుల ఎత్తులో నీరు చేరింది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 1,000 ఎకరాలు పంట నీటమునిగినట్టుగా చెబుతున్నారు. ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిడమనూరు-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. 

click me!