జివిఎంసి పరిధిలో ఆస్తి పన్ను పెంపు... ఆందోళనలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష పార్టీలు

By Arun Kumar PFirst Published Jun 9, 2021, 4:13 PM IST
Highlights

ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 11 వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

విశాఖపట్నం: విలువ ఆధారంగా ఆస్థిపన్ను భారీగా పెంచుతూ మహా విశాఖ నగర పాలక సంస్థ(జివిఎంసి) తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. ఇందుకోసం ఈనెల 03వ తేదీన విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పూర్తిగా చట్ట వ్యతిరేకం, అప్రజాస్వామికమని... వెంటనే రద్దు చేయాలని బుధవారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేసింది. ఇందుకోసం జూన్ 11 వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, సిపిఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, జనసేన పార్టీ నాయకులు, 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొడుదాసు సుధాకర్, లోక్ సత్తా నాయకులు వి హరి గణేష్, సీపీఐ ఎంఎల్ నాయకులు గణేష్ పాండా తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 

2021 మార్చిలో 98మంది కార్పొరేటర్లు ప్రజల చేత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయ్యారు కాబట్టి మొదటి  కౌన్సిల్ సమావేశంలో ఈ ఆస్థిపన్ను పెంపు ఏజెండాలో పెట్టి చర్చించాల్సిందన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జివిఎంసి కమీషనర్ ఏకపక్షంగా ఆస్థిపన్నును భారీగా పెంచుతూ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చెయ్యడం చట్ట వ్యతిరేకం అని అన్నారు. ఇది ఎన్నికయిన మేయర్ ని, కార్పోరేటర్లను మొత్తంగా కౌన్సిల్ ను అవమానపర్చటమేనని భావిస్తున్నామన్నారు. అంతేకాక జివిఎంసిలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు మొత్తం 13 మంది ప్రజలెనుకున్న ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వుంటారని... వీరందరి ఆమోదం లేకుండా భారీగా ఆస్థిపన్ను పెంచి 20 లక్షల మంది ప్రజల మీద మోయలేని భారం వేయటం అప్రజాస్వామ్యకం అని అన్నారు. 

read more  మాతో వ్యవహరించినట్టు జూడాలతో వద్దు...: జగన్ సర్కార్ ను కోరిన లోకేష్

స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జివిఎంసి ఉన్నప్పుడు 1976/2021 తేదీ 31-01-2021న ఆస్థిపన్ను పెంచాలని తీర్మానం చేశారని ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్నారని... కాని 2021 మార్చి 18న జివిఎంసిలో ప్రజలు ఎన్నుకున్న కౌన్సిల్ ఏర్పడిందన్నారు. ఇప్పుడు ఈ కౌన్సిల్లో చర్చించకుండా గతంలో చేసిన తీర్మానాన్ని అమలకు పూసుకోవడం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిలో ఏర్పడిన తరువాత ఆస్థిపన్ను పెంచాలంటే తప్పని సరిగా కౌన్సిల్లో చర్చించి ఆమోదం పొందాల్సిందేనని మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో పేర్కొందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి కౌన్సిల్తో సంబంధంలేకుండా ఆస్థిపన్ను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జివిఎంసి కమీషనరు లేదని తెలియజేశారు. 

ఇప్పటి వరకూ అమలులో ఉన్న ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను మధించే పద్ధతిని రద్దు చేసి భవనం మూలధన విలువల ఆధారంగా ఆస్థిపన్ను గణించే పద్ధతిని తీసుకొచ్చారని... నివాస భవనములకు 0.15శాతం, నివాసేతర భవనములకు 0,30శాతం చొప్పున ఆస్థిపన్ను విధింపు ప్రతిపాదన చేశారన్నారు. దీనివల్ల నగరంలో ఆస్థిపన్ను 3 నుండి 5 రెట్లు పెరుగుతుందని... దీంతో నగర ప్రజలపై అదనంగా సుమారు రూ.700 కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  
 

click me!