
అమరావతి : ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచులు తమ సమస్యలపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు వినతిపత్రం అందించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి మండలంలోని నిడమర్రులో సర్పంచులు కలిసారు. వారి సమస్యలను విన్న లోకేష్ తమ హక్కుల కోసం పోరాటంచేస్తున్న సర్పంచులకు టిడిపి సంపూర్ణ మద్దతు వుంటుందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పంచాయితీలకు పూర్వవైభవం తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
వైసిపి ప్రభుత్వం కొల్లగొట్టిన 14, 15 ఆర్ధిక సంఘాల నిధులు తిరిగి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని లోకేష్ ను ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు కోరారు. సైకో ముఖ్యమంత్రి స్థానిక సంస్థల నిధులనే కాదు సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ల అధికారులను సైతం కత్తిరించాడని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75శాతం మంది వైసిపికి చెందినవారే సర్పంచ్ లు,ఎంపిటీసి, జడ్పిటిసిలుగా వున్నారని... వీరిలో 50శాతం మందికిపైగా జగన్ సర్కార్ తీరుపై అసంతృప్తితో వున్నారని పేర్కొన్నారు.
Read More యువతలో పెరుగుతున్న అలసత్వం, డ్రగ్స్ వినియోగంపై పోరాడుదాం : నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం అధికారంలోకి వస్తే పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపర్చాలని సర్పంచ్ లు లోకేష్ ను కోరారు. రాష్ట్రంలోని అన్ని మైనర్ గ్రామపంచాయితీల విద్యుత్ బకాయిలు మాపీ చేయాలని కోరారు. అలాగే వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలు గ్రామ పంచాయితీకి జవాబుదారిగా వుండేలా చూడాలన్నారు. ఇక ప్రజాసేవ చేసే సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల కుటుంబంతో కలిసి కలియుగదైవం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఏడాదిలో ఒక రోజు బ్రేక్ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచుల సంఘం లోకేష్ ను కోరింది.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా మీరు తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సర్పంచులు లోకేష్ కు తెలిపారు. కాబట్టి సర్పంచులు, ఎంపిటిసి, జడ్పిటిసిల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిపెస్టోలో పెడితే అందరి మద్దతు టిడిపికే లభిస్తుందన్నారు. కాబట్టి తమ విజ్ఞప్తిని మన్నించి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని సర్పంచుల సంఘం నాయకులు లోకేష్ కు సూచించారు.