బాపట్ల జిల్లాలోని అమృతలూరు మండలంలో పంటకాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి విద్యార్ధులకు గాయాలయ్యాయి.
అమరావతి: బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇండిపెండెన్స్ డే వేడుకల అనంతరం విద్యార్థులను ఇంటికి తీసుకువస్తున్న సమయంలో స్కూల్ బస్సు అదుపు తప్పి పంటకాలువలోకి వెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు బోల్తా పడగానే విద్యార్థులు భయంతో కేకలు వేశారు. అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి పంట కాలువలో బస్సు బోల్తా పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. మరో వైపు సమీపంలో పనిచేస్తున్న కూలీలను కూడ పిలిచి విద్యార్ధులను బస్సు నుండి బయటకు తీశారు.
జిల్లాలోని అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్ లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బస్సులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు.