
బ్యాంకర్లు, ఆర్బిఐ అధికారులతో చంద్రబాబు చేస్తున్న హడావుడి రోజురోజుకు ఎక్కువైపోతోంది. ఒకవైపు పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సంక్షోభం మరింత పెరుగుతున్నది. ఆర్బిఐ నుండి బ్యాంకులకు అందాల్సిన డబ్బు అందటం లేదు. ఏటిఎంల్లో సరిపడా డబ్బుండటం లేదు. దాంతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. దానికి తోడు కేంద్రం రోజుకో నిర్ణయం తీసుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది.
పెరిగిపోతున్న ప్రజల అవసరాలు, అసహనం ఓవైపు, పంపిణీకి సరిపడా నగదు అందక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బ్యాంకు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రతీ రోజు బ్యాంకర్లతోను ఆర్బిఐ అధికారులతోను సమావేశాల జరపటం వారిలో మరింత అసహనం పెంచేస్తోంది.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలే ప్రత్యమ్నాయమని చంద్రబాబు కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. ప్రజల్లో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఆర్బిఐ, ఉన్నతాధికారులతో నాలుగు కమిటీలు వేయటం గమనార్హం. నిజానికి బ్యాంకులు, ఆర్బిఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారు కారు. వారెవరూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పనిచేయరు.
రాష్ట్రాల్లోని బ్యాంకు అధికారులు, ఆర్బిఐ అధికారులు ఏ పనిచేయాలన్నా వారి ఉన్నతాధికారుల నుండి ఆదేశాలందాల్సిందే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా చంద్రబాబు ఎందుకు ఇంతహడావుడి చేస్తున్నారంటే దానికి ఓ నేపధ్యముంది. పెద్ద నోట్ల రద్దును తొందరపడి స్వాగతించటమే కాకుండా తాను రాసిన లేఖ వల్లే పెద్ద నోట్ల రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఈనెల 8వ తేదీన ప్రకటించారు.
అయితే ఊహించని రీతిలో నోట్ల రద్దును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాగ్రహాన్ని గమనించిన చంద్రబాబు తన తొందరపాటును గ్రహించారు. పైగా చంద్రబాబు ప్రకటనపై ప్రజల ఆగ్రహాన్ని కూడా ప్రజాప్రతినిధులు సిఎం దృష్టికి తెచ్చారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని చంద్రబాబు మెల్లిగా ప్రజల దృష్టిని తన నుండి కేంద్రంవైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నుండి పుట్టుకొచ్చిందే ఈ హడావుడి.
జనధన్, ఆధార్, రూపే కార్డుల అనుసంధానం, మొబైల్ బ్యాకింగ్, ప్లాస్టిక్ కరెన్పీ వాడకం లాంటవన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశాలే. అయినా చంద్రబాబు ఇక్కడ హడావుడి చేసేస్తున్నారు. నోట్ల రద్దు సంక్షోభం నుండి రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు తాను శాయశక్తుల కష్టపడుతున్నట్లు ప్రజలకు కలరింగ్ ఇవ్వటమే అసలు ఉద్దేశ్యంగా తెలుస్తోంది.