
అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురష్కరించుకుని అన్ని జిల్లాల్లో భారీ సభలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు దివంగత జీఎంసీ బాలయోగి పేరు పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అమరావతిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ప్రతిపాదనలను తక్షణం సిద్ధం చేయాలనని కూడా ఆయన ఈరోజు అధికారులకు సూచనలిచారు.సంక్షేమ ఫలాలు అందించడంలో వ్యత్యాసాలు చూపిస్తే ఆయా వర్గాల్లో అసంతృప్తిని రాజుకునే ప్రమాదం వుందని హెచ్చరించారు. అక్షరాస్యత, ఐఎంఆర్, ఎంఎంఆర్ వంటి విషయాలలో ఉన్నతవర్గాలకు - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మధ్య వున్న అంతరాలను గుర్తించి, వాటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో బీసీ అభ్యర్ధులు రాణించేందుకు ఉద్దేశించిన ‘ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ’ పథకానికి అనూహ్య స్పందన వస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పథకం కింద ఈ ఏడాది 658 మంది బీసీ విద్యార్ధులకు దేశంలోని పది ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ సౌలభ్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ. 5.34 కోట్లు ఖర్చు చేశామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, బ్యాంక్ పీవో, పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షల కోసం 1,526 మంది అభ్యర్ధులకు రూ. 53 లక్షల ఖర్చుతో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వచ్చే నెల నుంచి గ్రూప్-2 పరీక్షకు కోచింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకంలో భాగంగా 278 మంది విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకురాగా, 170 మందికి ఇప్పటికే సాయం అందించినట్టు అధికారులు చెప్పారు. బ్యాంక్ పీవోలు, క్లర్క్‌ల పోస్టుల కోసం 701 మందికి మూడు కోచింగ్ సెంటర్లలో రూ.1.29 కోట్లతో శిక్షణ ఇస్తున్నామని అన్నారు.
ప్రపంచ బ్యాంక్ సాయంతో రూ. 99 కోట్లు వినియోగించి రాష్ట్రంలోని 32 బీసీ గురుకుల పాఠశాలల బలోపేతానికి సంబంధించిన పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 4,61,527 మంది బీసీ విద్యార్ధులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించామన్నారు.