
కాలం బహు విచిత్రమైనది సుమా. అందుకే కాలాన్ని పెద్దలు ఒక చక్రంతో పోల్చారు. ఇదంతా ఎందుకంటారా? అక్కడకే వస్తున్నా. పెద్ద నోట్ల రద్దు అంశం దేశంలో ఇపుడు ఎంత సంక్షోభాన్ని సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఎప్పడైతే కరెన్సీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయో గతంలో జరిగిన నోట్ల రద్దుతో పోలికలు వస్తున్నాయి.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇప్పటి వరకూ దేశంలో జరిగిన పెద్ద నోట్ల రద్దు అంతా ఒక రాష్ట్రంలోని నేతల ఆధ్వర్యలోనే జరగటం నిజంగా విచిత్రమే. దేశంలో ఇప్పటి వరకూ మూడు సార్లు పెద్ద నోట్ల రద్దు జరిగింది. మొదటిసారిగా 1946లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రిగా ఉన్నపుడు పెద్ద నోట్లు రద్దు అయ్యాయి. ఆ తర్వాత 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నపుడు రద్దయింది.
ఇక,తాజాగా నరేంద్రమోడి పెద్ద నోట్లను రద్దు చేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిదిః పై ముగ్గురూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావటం. రెండవదిః పెద్ద నోట్లు రద్దైన మూడు సార్లు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండటమే. కాకతాళీయమేనంటారా.
కాకపోతే మొదటి రెండు సార్లు పెద్ద నోట్లు రద్దైనపుడు దేశంలో ఇబ్బందులు ఎదరవ్వలేదు. ఎందుకంటే, అప్పట్లో పెద్ద నోట్ల చెలామణి చాలా తక్కువ. కానీ ప్రస్తుతం పెద్ద నోట్ల చెలామణి మొత్తం కరెన్సీలో 86 శాతం కావటమే గమనార్హం. 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను ఏకపక్షంగా రద్దు చేయటం, చిన్న నోట్లను ప్రజల అవసరాలకు సరిపడా అందుబాటులో ఉంచకపోవటంతోనే దేశమంతా ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది.