
తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. టిడిపి నేతలపై ఎప్పటి నుండో ఉన్న కేసులను ఎటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా ఎత్తేస్తోంది. ఒకవైపు తమ వారిపై కేసులను ఎత్తేస్తూనే ఇంకోవైపు వైసీపీ నేతలపై అడ్డుగోలు కేసులు బనాయిస్తోంది. కేసులు ఎత్తేయటం కోసం ఏకంగా మూడేళ్ళల్లో 132 జీవోలు జారీ చేసిందంటే బరితెగింపు ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేసులను ఎత్తేయించుకున్న ప్రముఖుల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబుతో పాటు 10మంది ఎంఎల్ఏలున్నారు.
మామూలుగా అయితే ఒకసారి కేసు అయి ఎఫ్ఐఆర్ దాకా వెళితే సదరు కేసును న్యాయస్ధానం మాత్రమే ఎత్తేయాలి. అయితే, ఇక్కడ అటువంటిదేమీ ఉన్నట్లు కనబడలేదు. పోలీసులపై చేయిచేసుకోవటం, పోలీసు స్టేషన్లపై రాళ్లు రువ్వటం లాంటి నాన్ బైలబుల్ కేసులు కోడెలపై ఉన్నాయి. అప్పట్లో అరెస్టయిన కోడెల కొద్దిరోజులు గుంటూరు సబ్ జైలులో రిమాండ్ లో కూడా ఉన్నారు. అటువంటిది కోర్టుతో సంబంధంలేకుండానే తాజాగా కేసు ఎత్తేసారు.
అదే సమయంలో ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నాన్ బైలబుల్ కేసు పెట్టారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించటానికి జగన్ వెళ్లారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్, వైద్యుడిని విధులకు ఆటంకపరిచారంటూ జగన్ పై కేసు నమోదైంది. ఇక, రోజా, ఎంపి మిధున్ రెడ్డి తదితరులపై పెట్టిన కేసులకు లెక్కేలేదు. అంటే మనోడైతే కేసులు ఎత్తేయటం, పగోడైతే కేసులు బనాయించటమే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది. ఏం చేస్తాం మనమున్నది చంద్రన్న జమానాలో కదా?