వైసిపి అభ్యర్ధిగా గౌరు ?

First Published Dec 20, 2017, 4:09 PM IST
Highlights
  • కర్నూలు జిల్లా స్ధానిక సంస్ధల ఎంఎల్సీ వైసిపి అభ్యర్ధిగా మళ్ళీ గౌరు వెంకటరెడ్డే పోటీ చేసే అవకాశాలున్నాయి.

కర్నూలు జిల్లా స్ధానిక సంస్ధల ఎంఎల్సీ వైసిపి అభ్యర్ధిగా మళ్ళీ గౌరు వెంకటరెడ్డే పోటీ చేసే అవకాశాలున్నాయి. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ది శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. అధికారంలో ఉండటం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం, అధికార వ్యవస్ధ చెప్పు చేతుల్లో ఉండటం లాంటి కారణాలతో టిడిపి గెలిచింది. జిల్లాలో 1066 ఓట్లుంటే టిడిపికి వచ్చిన మెజారిటీ కేవలం 64 ఓట్లు మాత్రమే.

సరే, వచ్చిన మెజారిటీ విషయాన్ని పక్కనపెడితే గెలుపుకోసం టిడిపి చాలా శ్రమించాల్సి వచ్చింది. నిజానికి స్ధానికసంస్ధల ఓట్లలో వైసిపికే మెజారిటీ ఉంది. అయితే, వైసిపి తరపున గెలిచిన భూమా నాగిరెడ్డితో పాటు నలుగురు ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించటంతో వారి మద్దతుదారులు కూడా టిడిపిలోకి వెళ్లిపోయారు. అయితే, ఎంతమంది టిడిపిలోకి ఫిరాయించినా టిడిపి అభ్యర్ధికి వైసిపి అభ్యర్ధి గట్టి పోటీనే ఇచ్చారు.

సరే, ప్రస్తుత విషయానికి వస్తే అప్పట్లో ప్రత్యర్ధులుగా తలపడిన గౌరు, శిల్పాలు ఇపుడు వైసిపిలోనే ఉన్నారు. దానికితోడు అప్పట్లో శిల్పా గెలుపుకోసం బాగా కష్టపడిన భూమానాగిరెడ్డి మరణించారు. దాంతో భూమా వర్గం  కొంతమేర దెబ్బతిన్నది. ఎన్నికలో నిలబడేందుకు టిడిపి తరపున చాలా మంది పోటీ పతున్నారు. అయితే, టిక్కెట్టు దక్కించుకున్న అభ్యర్ధికి మిగిలిన నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే.  

ఇక వైసిపి అభ్యర్ధి విషయంపై అనంతపురం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ కర్నూలు జిల్లా నేతలతో చర్చించినట్లు సమాచారం. శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేయటానికి ఇష్టపడకపోవటంతో మళ్ళీ గౌరు అభ్యర్ధిత్వమే తెరపైకి వచ్చింది. ఎవరు పోటీచేసినా తమ మద్దతుంటుందని శిల్పా సోదరులు జగన్ కు భరోసా ఇచ్చారట. దాంతో మళ్ళీ గౌరే అభ్యర్ధి అవ్వటానికి అవకాశాలున్నాయి.

మొన్నటి నంద్యాల ఉపఎన్నిక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా వ్యూహాన్ని రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ ఓటర్లను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారట. తమ వాస్తవ బలమెంతో ముందుగా అంచనా వేసుకుంటునే, ప్రత్యర్ధుల బలంపై కూడా చర్చలు జరిపారట. తమ బలంలో ఎటువంటి తేడా లేదని, ఏమన్నా తేడాలుంటే అది టిడిపిలోనే ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారట. అంటే వైసిపి అభ్యర్ధి ఎవరో దాదాపు తేలిపోయినట్లే. టిడిపి అభ్యర్ధి విషయం కూడా 23వ తేదీ తేలిపోవచ్చు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వ్యూహాలను వైసిపి ఎలా ఛేదిస్తుందో చూడాలి.

click me!