
అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై పార్టీలో ఉన్న వ్యతిరేకత మెల్లిగా బయటపడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వర్గపోరు బయటపడుతుండటంతో పార్టీ నేతలు ఆందోళన పడుతున్నారు. జెసిపై టిడిపిలో ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో తాజాగా జరిగిన ఓ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. బుధవారం అనంతపురం మేయర్ జెసిపై నిప్పులు చెరిగారు. మేయర్ స్వరూప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జెసిని ఓ రాక్షసునిగా వర్ణించటంతో అందరూ నివ్వెరపోయారు.
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఎంపి అభివృద్ధికి అడ్డుపడుతున‍్న రాక్షసుడ’ని ధ్వజమెత్తారు. వంద కోట‍్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా నల‍్ల అద్దాలు పెట్టుకున‍్న దివాకర్ రెడ్డికి అవి కనిపించట్లేదని మండిపడ్డారు. వెంటనే నల‍్లకళ్ళజోడు తీసి తెల‍్లఅద్దాలు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. చుట‍్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనులను కన్నెత్తి చూడకుండానే విమర‍్శలు చేస్తున్నారన్నారు.
జేసీ కేవలం తిలక్‌రోడ్, సూర‍్యనగర్ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్ ఎద్దేవా చేశారు. అనంతపురం పార‍్లమెంట్ సభ‍్యునిగా జేసీ నగర అభివృద్ధికి ఇంతవరకూ అర‍్ధరూపాయి కూడా ఖర్చు పెట‍్టలేదని ఆరోపించారు. తాము చేస్తున‍్న అభివృద్ధి పనులకు అడ్డుపడటం మాని ఇప్పటికైనా మంచి పనులుచేసి రాజకీయాలకు గుడ్‌బై చెబితే మంచిదని ఓ సలహా కూడా పడేసారు స్వరూప.