
గుంటూరు: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ గుంటూరు ఎస్పీకి బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. నిందితుడికి తగిన శిక్ష పడేలా చూసి తమకు న్యాయం చేయాలంటూ సదరు కుటుంబం ఎస్పీని కోరింది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అచ్చంపేట మండలం రోకలిబండవారి పాలెంకు చెందిన ఓ బాలిక అత్యాచారానికి గురయ్యింది. విషయం తెలియడంతో ఈ దారుణానికి పాల్పడిన యువకుడు అశోక్ ను బాలిక తల్లి, నాన్నమ్మ నిలదీశారు. దీంతో వారిపై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు.
దీంతో బాధిత కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడిపై అత్యాచారం కేసు కాకుండా కేవలం దాడి కేసును మాత్రమే పోలీసులు నమోదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే పోలీసుల నుండి సరయిన సమాధానం రావడంలేదని... నిందితుడిని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ జిల్లా ఎస్పీని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీసుల నుండి సేకరించి పరిశీలిస్తానని... తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.