విశాఖలో జగన్ కోసం కట్టే భవనాల్లో కమోడ్ లు, కుళాయిల కోసమే లక్షల రూపాయలకు ఖర్చు చేస్తున్నారంటూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం : విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ప్రశ్నించారు. దసరాకు విశాఖకు వస్తున్నట్లుగా ప్రకటించిన ముఖ్యమంత్రి…దొడ్డిదారిన రెండు జీవోలు తేవడం వెనక ఆంతర్యం ఏమిటో అని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. రిషికొండపై నిర్మాణాలకు దాదాపుగా రూ.286 కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
జగన్ కోసం ఋషికొండపై కడుతున్న నిర్మాణాలు ఓ సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి ఇల్లా మాదిరిగా ఉన్నాయన్నారు. జగన్ కోసం కడుతున్న భవనాల్లోని బాత్రూంలోనే కమోడ్ రూ.25 లక్షలని, కులాయి రూ.6 లక్షల విలువైనవని అన్నారు. ఈ భవనాల్లో వేసిన మార్పులకు ఒక్క చదరపు అడుగుకు 25 వేల రూపాయలు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
ఇవన్నీ రహస్యంగా జరుగుతున్నాయని.. అయితే త్వరలోనే వీటి గురించిన వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని గంట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ప్రభుత్వానికి 100 రోజులు మాత్రమే గడువుందని గుర్తు చేశారు. పాలన చివరి దశకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకు రావడం అని అన్నారు.