Three Capitals : మూడు రాజధానుల ప్రకటనకు నాలుగేళ్ళు ... సరిగ్గా ఇదే రోజు అమరావతి ఆశలు గల్లంతు

By Arun Kumar PFirst Published Dec 17, 2023, 12:46 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో గందరగోళం మొదలయి నేటితో నాలుగేళ్ళు పూర్తవుతోంది. మూడు రాజధానుల ప్రకటనను సరిగ్గా ఇదేరోజు అంటే డిసెంబర్ 17, 2019లో సీఎం జగన్ అసెంబ్లీలో చేసారు. 

అమరావతి : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు పదేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ఏదో స్పష్టత లేకుండానే పాలన సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతి నిర్మాణాన్ని చేపట్టింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి ఒక్కటే కాదు మరో రెండు రాజధానులు కూడా ఆంధ్ర ప్రదేశ్ కు వుంటాయన్న ప్రకటనతో గందరగోళం మొదలయ్యింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదేరోజున అంటే డిసెంబర్ 17, 2019 లో అసెంబ్లీ వేదికన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడురాజధానుల ప్రకటన చేసారు. దీంతో ఆనాటి నుండి నేటివరకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏదంటే టక్కున చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఎదురవుతూ వస్తోంది. 

అమరావతి శాసన రాజధానికి కొనసాగిస్తూనే విశాఖపట్నంను పాలన,  కర్నూల్ ను న్యాయ రాజధాని చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ది ఒకేచోటికి పరిమితం కాకుండా వుండేందుకే సౌతాఫ్రికా మాదిరిగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు. గతంలో కేవలం హైదరాబాద్ లోనే  అభివృద్ది కేంద్రీకృతం చేయడంతో విభజన తర్వాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందని... మళ్లీ అదే తప్పు చేయకూడదనే మూడురాజధానుల ఏర్పాటుకు సిద్దమైనట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు.  

Latest Videos

అయితే మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల బాట పట్టారు. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు మరికొన్ని పార్టీలు, రాజకీయ నాయకులు సైతం అమరావతినే కొనసాగించాలంటూ గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. కానీ వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా రేపోమాపో విశాఖ నుండి పరిపాలనను ప్రారంభిస్తామని అంటోంది. 

Also Read  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు: ఫిబ్రవరిలో షెడ్యూల్

ఇప్పటికే అమరావతి నిర్మాణాన్ని నిలిసివేసిన జగన్ సర్కార్ విశాఖపట్నంలో నిర్మాణాలు చేపట్టింది. అంతేకాదు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల నివాసాల కోసం చర్యలు చేపట్టారు. అలాగే విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రిషికొండపై వున్న మిలీనియం టవర్స్‌లో మంత్రులు , అధికారుల క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ గుర్తించింది.  ఇలా పాలనను అమరావతి నుండి విశాఖకు షిప్ట్ చేసేందుకు వేగంగా పనిచేస్తోంది వైసిపి సర్కార్. 

అయితే రాజధానిని అమరావతి నుండి తరలిపోకుండా చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు గత నాలుగేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు,  ముట్టడులతో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు వేలమందికి పైగా కేసులు నమోదయ్యారు... 200 మంది అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న ఎస్సీ రైతులపైనే ప్రభుత్వం అట్రాసిటీ కేసులు పెట్టించిందంటేనే అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎంతలా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. కానీ అమరావతి ప్రజలు మాత్రం వెనక్కి తగ్గకుండా గత నాలుగేళ్లుగా ఆందోళనలు కొనసాగిస్తూనే వున్నారు. 

click me!