ఏపీకి మూడు రాజధానులు: జగన్ కు జై కొట్టిన టీడీపీ నేత

By narsimha lodeFirst Published Dec 19, 2019, 5:55 PM IST
Highlights

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయమై ఏపీ సీఎం జగన్ నిర్ణయానికి మరో టీడీపీ నేత జై కొట్టారు. 


శ్రీకాకుళం:ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్నప్పటికీ కొందరు టీడీపీ నేతలు  మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.  తొలుత మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఈ నిర్ణయాన్ని సమర్ధించగా, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడ  కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని సమర్ధించారు. తాజాగా మాజీ మంత్రి కొండ్రు మురళి కూడ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనపై తీవ్ర  చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు కొందరు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. . ఈ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించాలని ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని ఆయన కోరారు.

 విశాఖపట్నానికి పరిపాలనా రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టైర్‌-1 సిటీ కావాలంటే కచ్చితంగా విశాఖపట్నాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు.

మెట్రో సిటీతో ఉపాధి లభించడంతో పాటు పెట్టుబడులు తరలివస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి వచ్చి చూసిన వెళ్లిన కంపెనీలు అటు నుంచి హైదరాబాద్‌ కానీ  బెంగళూరు కానీ వెళ్లి పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు.

వైజాగ్‌ను పరిపాలనా రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, దీన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వాదించడానికి లేదన్నారు. రాజధాని ప్రతిపాదనలకు  రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ కంటే ప్రాంతం ముఖ్యమని స్పష్టం చేశారు.

 పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామంటే అడ్డుకోవడం సరికాదని అచ్చెన్నాయుడుతో కూడా చెప్పినట్టు వెల్లడించారు. . మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబును ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని కొండ్రు మురళి వ్యక్తం చేశారు. 

click me!