మూడు మాసాల క్రితం ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఇవాళ ఎందుకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
అమరావతి: ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయకుండానే ఎలా ట్యాపింగ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని చంద్రబాబునాయుడు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.
బుధవారం నాడు తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ మూడు నెలల క్రితమే చేస్తే అప్పుడే చెప్పొచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పార్టీ నుండి వెళ్లిపోయే ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారన్నారు.సానుభూతి కోసమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని నాని స్పష్టం చేశారు. జగన్ పార్టీ ఏర్పాటు చేయకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా అని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రి అయ్యేవాడినా అని ఆయన అడిగారు.
సీఎం గురించి ఎబ్బెట్టుగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణలో ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఆడియో సంభాషణను పంపించి ఉండొచ్చని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్దంగా ఉన్నారని అర్ధమైందన్నారు. నాలుగైదు దఫాలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి మంత్రి పదవులు కూడ దక్కలేదన్నారు. సామాజిక సమతుల్యత ఆధారంగా మంత్రి పదవులు కేటాయిస్తారన్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు.