జగన్ ది అబద్ధాల యాత్ర

First Published Nov 20, 2017, 1:59 PM IST
Highlights
  • ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాలకు అబద్దపు హామీలు ఇస్తున్నట్లు టిడిపి మండిపడింది.

ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాలకు అబద్దపు హామీలు ఇస్తున్నట్లు టిడిపి మండిపడింది. జగన్ ఇస్తున్న హామీలను ప్రజల నమ్మే పరిస్దితి లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తదితరులు ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ, జగన్ ది ప్రజా సంకల్పయాత్ర కాదని కేవలం అబద్దాల యాత్రగా వారు ఎద్దేవా చేయటం గమనార్హం. జగన్ ఇపుడు చేస్తున్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేడని వారన్నారు.

రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రూ. 27 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారని మంత్రి గుర్తుచేశారు. రుణమాఫీ, బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ లాంటి కార్యక్రమాల వల్ల చంద్రబాబు పట్ల రైతుల్లో నమ్మకం పెరిగిందన్నారు. వైఎస్ హయాంలో 14 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వారు ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలోనే 85 శాతం ప్రాజెక్టులు పూర్తయితే ఒక్క ఎకరాకు కూడా ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.

వైస్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని మండిపడ్డారు. వచ్చే మార్చికల్లా 28 ప్రాజెక్టులు వచ్చే మార్చికల్లా పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. సంక్షేమ రంగంలో గతంలో ఎన్నడూ చేయనంత ఖర్చును చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కడని జోస్యం చెప్పారు. లక్ష కోట్లకు పైగా అక్రమాలు, అవినీతికి సంబంధించి జైలుకు కూడా వెళ్ళొచ్చిన జగన్ మాటలను జనాలు నమ్మరంటూ కుండబద్దలు కొట్టినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నట్లు కూడా మంత్రి చెబుతున్నారు.

click me!