పోలవరంపై మాట మార్చిన దేవినేని

First Published Nov 20, 2017, 12:25 PM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మాట మారుతోంది.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మాట మారుతోంది. మొన్నటి వరకూ 2018కి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2019 కల్లా ప్రాజెక్టు నుండి గ్రావిటీ ద్వారా పోలవరం నుండి నీరందిస్తామంటూ చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గట్టిగా చెప్పేవారు. వైసీపీ తదితర ప్రతిపక్షాలు అవకాశం లేదని చెప్పినా, జెసి దివాకర్ రెడ్డి లాంటి సొంత ఎంపిలు సాధ్యం కాదని చెప్పినా దేవినేని మాత్రం ‘సమస్యే లేదు నీరందిస్తాం’ అంటూ జబ్బలు చరుచుకునే వారు. అటువంటిది హటాత్తుగా దేవినేని మాట మార్చారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ‘2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తాం’ అంటూ చల్లగా చెప్పారు. అంటే అర్ధం ఏంటి? గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి కావనే కదా? దేవినేని వాయిస్ లో ఎందుకంత మార్పొచ్చింది? అంటే, మొన్ననే వెలుగు చూసిన కేంద్ర కమిటీ మసూద్ అహ్మద్ నివేదిక. ఆ నివేదికలో కమిటీ రాష్ట్రప్రభుత్వ నిర్వాకాన్ని వాయించొదిలేసింది. ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పులను ఎత్తిచూపుతూ గడువులోగా ప్రాజెక్టు పనులు అయ్యే అవకాశాలు లేవని స్పష్టంగా కేంద్రానికి నివేదిక రూపంలో చెప్పేసింది. దాంతో దేవినేని కూడా గొంతును సవరించుకోవాల్సి వచ్చింది.

అందుకనే పోలవరం పనులపై చాలా మెత్తగా మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పనులను పరిగెత్తిస్తున్నారని దేవినేని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ 50 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామన్నారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసినట్టే గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తామని దేవినేని చెప్పటం గమనార్హం.

click me!