
అమలాపురం : కొందరు భక్తులు దైవదర్శనానికి వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ దుర్ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి గ్రామానికి చెందిన తొమ్మిదిమంది కోనసీమ జిల్లాలోని మందపల్లి శనేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ గూడ్స్ వాహనాన్ని అలుమూరు మండలం మడికి వద్ద వెనకనుండి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ప్రాణనష్టం జరిగింది.
విశాఖపట్నం నుండి పాలకొల్లు వెళుతున్న కారు డీకొట్టడంతో టాటా ఏస్ ను రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ సమయంలో టాటా ఏస్ మంచి స్పీడ్ లో వుండటంతో ఓ ప్రహారిగోడను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. కారు కూడా రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగింది. దీంతో రెండు వాహనాల్లోని ఐదుగురు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read More గుడివాడ డిపో పల్లె వెలుగు బస్ ప్రమాదం... పలువురికి గాయాలు
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ వెంకినాయుడు తో పాటు ముద్దుర్తికి చెందిన కన్నయ్య లింగం, వెంకటరమణ, శ్రీను ఈ ప్రమాదంలో మృతిచెందారు. గాయాలపాలైన వారిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసి కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు.
రోడ్డుప్రమాదంపై సమాచారం అందినవెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. అతివేగమే ఈ రోడ్డుప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.