కడపలో విషాదం.. ఐదుగురు చిన్నారుల ప్రాణంతీసిన ఈత సరదా 

Published : May 14, 2025, 11:41 AM ISTUpdated : May 14, 2025, 11:52 AM IST
కడపలో విషాదం.. ఐదుగురు చిన్నారుల ప్రాణంతీసిన ఈత సరదా 

సారాంశం

కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎండలనుండి ఉపశమనం కోసం చెరువులో ఈతకు దిగిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు చెందిన వివరాలిలా ఉన్నాయి. 

Kadapa : మండుటెండల వేళ సరదాగా ఈతకు వెళ్లి ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో మల్లేపల్లిలోని తమ పుట్టింటికి పిల్లలతో వెళ్లారు సావిత్రి, భవాని. ఇలా హైదరాబాద్ నుండి వచ్చిన పిల్లలు మంగళవారం  సరదాగా ఈతకు వెళ్లారు... గ్రామానికి చెందిన మరికొందరు చిన్నారులతో కలిసి మల్లేపల్లి శివారులోని చెరువులో ఈతకు దిగారు. అయితే బాగా లోతులోకి వెళ్లడంతో చరణ్ (15), దీక్షిత్ (12), హర్ష (12), పార్థు (12), తరుణ్ యాదవ్ (10) నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. 

చిన్నారులు నీటమునిగిన విషయం రాత్రి వరకు ఎవరికీ తెలియదు... సరదాగా ఎక్కడో ఆడుకుంటున్నారని కుటుంబసభ్యులు భావించారు. అయితే చీకటి పడుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గ్రామంలో వెతకసాగారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని చెరువు గట్టుపై వీరి బట్టలు కనిపించాయి. వెంటనే వారు చెరువులోకి దిగినా బాలుర ఆఛూకీ లభించలేదు. 

పిల్లల మిస్సింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గ్రామస్తుల సాయంతో గాలింపు చేపట్టారు. చాలాసేపటి తర్వాత అంటే దాదాపు రాత్రి 11-12 గంటల సమయంలో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. చెరువులోంచి బయటకుతీసిన తమ పిల్లల మృతదేహాలపై పడి ఆ తల్లులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూసేవారితో కన్నీరు పెట్టించింది. 

చెరువులోని బయటకు తీసిన మృతదేహాలను ఏరియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇవాళ(బుధవారం) పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు చిన్నారుల మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం