
YSR Congress Party : కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు కీలక నాయకులు వైసిపిని వీడేందుకు సిద్దమయ్యారు.. ఇక పార్టీలోనే ఉంటున్నవారిలో ఒకరంటే ఒకరికి పడటంలేదు. ఇలా తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా వైసిపి జిల్లాస్థాయి నాయకుడొకరు తిరుగుబాటు చేసారు. మంత్రిగా పనిచేసిన నాని కంటే ప్రస్తుత గుడివాడ టిడిపి ఎమ్మెల్యే పనితీరే బాగుందంటూ వైసిపి నేత చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండగా మాజీ మంత్రి నాని అజ్ఞాతంలో ఉండటాన్ని వైసిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం తప్పుబట్టారు. వైసిపి ఆయన రాజకీయ ఎదుగుదలకు సహాయపడిందని... అలాంటి పార్టీకి ఇప్పుడతను నమ్మకద్రోహం చేస్తున్నాడంటూ కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేసారు. ఓడిపోగానే గుడివాడ ప్రజలను కూడా నాని దూరం పెట్టాడని... ఎన్నికల తర్వాత ఆయన ఎక్కడుంటున్నారో కూడా తెలియడంలేదని ఖాసీం అన్నారు.
గతంలో బుడమేరు వరదల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అతడి అనుచరులు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారని ఖాసీం కొనియాడారు. ఎమ్మెల్యే తన భద్రతను పక్కనబెట్టిమరీ సహాయక చర్యల్లో పాల్గొన్నారని... వరద బాధితులకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారన్నారు. మరి ఏళ్లకేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఎక్కడున్నాడంటూ వైసిపి నేత ప్రశ్నించారు.
ఇలా వైసిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సొంత పార్టీకే చెందిన మాజీ మంత్రి నానిపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను టిడిపి శ్రేణులు బాగా ప్రచారం చేస్తున్నారు. గత వర్షాకాలం సమయంలోని వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో కొడాలి నానికి ఇబ్బందికరంగా మారింది.