
నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు అర్బన్ పోలీసులు రట్టు చేశారు. కొద్దిరోజుల కిందట పలువురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఈ కేసులో మరిన్ని వాస్తవాలు తెలిశాయి.
వివరాల్లోకి వెళితే.. బ్యాంక్‌ల నుంచి ఆధార్ అధికారిక వెబ్‌సైట్ ఐడీలు తస్కరించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గుంటూరు - మంగళగిరి రోడ్డులో పలువురు యువకులు ప్రజా సేవ ముసుగులో ఓ కంప్యూటర్ కేంద్రం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం ఇటీవల వయస్సుల వారీగా పలు పథకాలను అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠా ఆధార్ కార్డులో వయసు మార్పులు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఈ కంప్యూటర్ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా దీని వెనుక ఓ పెద్ద ముఠా ఉందని గుర్తించారు. మంగళవారం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదార్ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో పాల్గొని ఇద్దరు వ్యక్తులు అనుమతులు పొందారు. వాళ్లు బ్యాంక్‌ల ద్వారా ఆధార్ కార్డులు జారీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడి అధికారిక వెబ్‌సైట్ నుంచి ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించినట్లు తెలుసుకున్నారు.
వీటీ ఆధారంగా సదరు కంప్యూటర్ కేంద్రంలో వెబ్‌సైట్‌ను తెరిచి ఆన్‌లైన్‌లో వయసు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం, స్టాంపులు తయారు చేసి వాటి ద్వారా నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ తొమ్మిది మందిలో ఇద్దరు ఆధార్ కేంద్రానికి అనుమతులు తీసుకున్న వారు కాగా మిగిలిన ఏడుగురిలో కొందరు టైపింగ్, మరికొందరు ప్రజలను కంప్యూటర్ కేంద్రానికి తీసుకొచ్చే బ్రోకర్లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు.