పోలవరం భవిష్యత్ తేలిపోతుందా ?

First Published Oct 24, 2017, 12:39 PM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు త్వరలో తేలిపోనుందా? కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
  • ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం తాజాగా ఓ నిపుణుల కమిటి వేసి 15 రోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించింది.
  • అందుకే ప్రాజెక్టు భవిష్యత్తు త్వరలో తేలిపోతుందని అనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు త్వరలో తేలిపోనుందా? కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం తాజాగా ఓ నిపుణుల కమిటి వేసి 15 రోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించింది. అందుకే ప్రాజెక్టు భవిష్యత్తు త్వరలో తేలిపోతుందని అనిపిస్తోంది.

పోలవరం త్వరగా పూర్తవ్వాలంటే కాంట్రాక్టర్ ను మార్చాల్సిందేనంటూ చంద్రబాబునాయుడు పట్టుబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కాంట్రాక్టర్ ను మార్చటానికి కేంద్రం జలవనుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎంత మాత్రం సుముఖంగా లేరు.

ఎందుకంటే, కాంట్రాక్టర్ మారితే మళ్ళీ అంచనాలు మారుతాయన్నది కేంద్రమంత్రి ఆందోళన. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16 వేల కోట్ల నుండి రూ. 53 వేల కోట్లకు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ సంస్ధకు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టేంత సామర్ధ్యం లేదు. అయినా సరే పట్టుబట్టి చంద్రబాబే ట్రాన్స్ ట్రాయ్ కు బాధ్యతలు అప్పగించారు. ఎందుకలా అంటే, సదరు సంస్ధ టిడిపి నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సంస్ధ నిధులు తీసుకున్నదే కానీ పనులు చేయటంలో మాత్రం నత్తతో పోటీ పడుతోంది. ఆ విషయాలు తెలిసినా చంద్రబాబు కూడా చాలా కాలం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముందస్తు ఎన్నికల వాతావారణం మొదలైందో అప్పటి నుండి చంద్రబాబు పోలవరంపై హడావుడి మొదలుపెట్టారు.

ట్రాన్స్ ట్రాయ్ ద్వారానే పనులు పూర్తి చేయించాలంటే అయ్యేపని కాదన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకే కాంట్రాక్టర్ మార్పు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకే, చంద్రబాబు డిమాండ్ మేరకు కేంద్రం తాజాగా నర్మద కంట్రోల్ అథారిటీ కార్యనిర్వాహక సభ్యుడు సిన్హా అధ్యక్షతన ఓ కమిటీ వేసింది. ఇప్పటి వరకూ జరిగిన పనులు, ఆర్ధిక అంశాలు, కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం తదితరాలను కమిటీ పరిశీలిస్తుంది.

ఇప్పటికే పోలవరంపై కేంద్రం వివిధ కమిటీలను వేసినా ఈ కమిటీ మాత్రం ప్రత్యేకం. బుధవారం ఢిల్లీలో గడ్కరీ అద్యక్షతన జరుగనున్న సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొంటారు. తర్వాతే పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కమిటీ వస్తుంది. అంటే రాష్ట్రానికి వచ్చేటప్పటికే కమిటీకి ప్రాజెక్టుపై ఓ అవగాహన వస్తుందన్న మాట. కాబట్టే 15 రోజుల్లో పోలవరం భవిష్యత్తేమిటో తేలిపోతుంది.

click me!