2024లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో నోట్లో వేళ్లు పెట్టుకుని చూడు.. నీకు అలవాటేగా : పవన్‌కు పేర్నినాని కౌంటర్

By Siva KodatiFirst Published Nov 27, 2022, 5:24 PM IST
Highlights

వైసీపీపై, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పవన్ నోట్లో వేళ్లు పెట్టుకుని చూడాలంటూ సెటైర్లు వేశారు. 

వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తెరపై ఎలా నడిస్తాడో కానీ, తన నటనా కౌశలంతో ఈ రోజు తెలుగు ప్రజలను అలరించి విమానం ఎక్కేశారంటూ సెటైర్లు వేశారు. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ కల్యాణ్ ప్రసంగంలో పనికొచ్చే విషయం ఒక్కటీ లేదన్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. మాటిమాటికీ వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తానని పవన్ అంటున్నారని, ఇప్పటం వాసుల్లా అమరావతి రైతులు పోరాడటం లేదని పవన్ చెబుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పవన్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని, పవన్ వచ్చాడని ఇప్పటంలో ఏం ఆడిందని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో దౌర్జన్యం చేసినప్పడు గుండెల్లో ఏమీ గుచ్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. సజ్జలకు నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా..? చంద్రబాబు రైతులకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమయ్యారని పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు కాళ్ల దగ్గర చోటుంటే చాలన్నది పవన్ ఆలోచన అని... ప్రజలకు జగన్ తన పాలనతో మరింత చేరువయ్యారని ఆయన పేర్కొన్నారు.

Also REad:వీకెండ్ సైకో: పవన్ కళ్యాణ్ కి ఏపీ మంత్రి జోగి రమేష్ కౌంటర్

పవన్ ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియదని.. మోడీతో పవన్ ఏం మాట్లాడితే మాకెందుకని పేర్ని నాని నిలదీశారు. పవన్‌కు ఎవరో సినిమా స్క్రిప్ట్ రాసిచ్చినట్లుందని.. ప్రభుత్వం ఇప్పటంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా మీకు బుద్ది రాలేదని పేర్ని నాని దుయ్యబట్టారు. దౌర్జన్యంగా పొలాల్లో రోడ్లు వేసినప్పుడు మీకు కనపడలేదా అని ఆయన ప్రశ్నించారు. 

రూట్ మ్యాప్ మోడీ ఇవ్వాలని అంటారని.. ఒక పార్టీ స్థాపించిన వ్యక్తి రూట్ మ్యాప్ కోసం ఇంకొకరిని అడుగుతారా అని పేర్ని నాని నిలదీశారు. మోడీ కాళ్లు పట్టుకునేది నువ్వే.. పారిపోయేది నువ్వేనంటూ పవన్‌పై ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మీద పడి ఏడ్చేది ఎవరు అంటూ నాని నిలదీశారు. 2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేక పారిపోయింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. పవన్ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేసేందేమి లేదని.. పవన్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2024లో వైసీపీకి 175 సీట్లు వస్తే చూస్తూనే వుంటావని.. అందరి హీరోల అభిమానులు జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటారని ఆయన అన్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడటం పవన్‌కు అలవాటని... పవన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని , జగన్ పాలన చూసి మీకెందుకు కడుపుమంట అని పేర్ని నాని ప్రశ్నించారు. 
 

click me!