రేట్లు పెంచితే సంపూర్ణ మద్యపాన నిషేధం జరగదు: జగన్‌పై ఆలపాటి ఫైర్

By Siva Kodati  |  First Published May 6, 2020, 4:06 PM IST

పేదవారు ఆకలితో అలమటిస్తుంటే.. అన్నం పెట్టకుండా జగన్ ప్రభుత్వం సారా పోస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్


పేదవారు ఆకలితో అలమటిస్తుంటే.. అన్నం పెట్టకుండా జగన్ ప్రభుత్వం సారా పోస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మద్యం షాపుల్ని తెరిచిందని ఆలపాటి మండిపడ్డారు.  

జగన్ నిర్ణయంతో ప్రజలందరూ విస్తుపోతున్నారని, కరోనా వ్యాధిని కట్టడి చేయకుండా... ప్రజలు మద్యం కోసం బారులు తీరేలా చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు మద్యం విక్రయాలను సమర్థించుకుంటున్నారని.. ప్రతిపక్షనేతగా చంద్రబాబు సూచనలను పాటించకుండా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.

Latest Videos

undefined

Also Read:టీడీపీ నేతలు నిజాలు తెలుసుకోండి.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

కేంద్రప్రభుత్వం పిలుపుమేరకు మద్యం షాపులు తెరిచామంటున్న వైసీపీ నేతలు.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపులను నిర్వహిస్తున్నారని ఆలపాటి మండిపడ్డారు. మంచి బ్రాండ్లను నిలిపివేసి, ఊరుపేరు లేని బ్రాండ్లను కొత్త డిస్టలరీలను తీసుకువచ్చారని విమర్శించారు.

కొన్ని బ్రాండ్లకే అనుమతి ఇచ్చి.. జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, వస్తువు అమ్మే ధర ఎక్కడైనా ఒకటే ఉంటుందని.. కానీ ఏపీలో మాత్రం బార్లకు ఒక ధర, వైన్‌షాపులకు ఒక ధర పెట్టి ప్రజలను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారని రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.

వైఎస్ హయాంలో ఇళ్లు కడితే 40 లక్షల ఇళ్లకు లెక్కలేదని,  అడిగితే ఇనుమును ఎలుకలు తిన్నాయని చెప్పేవారని.. ఇప్పుడు జగన్ పాలనలో కూడా మద్యాన్ని ఎలుకలు తాగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

Also Read:బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ వైసిపి నేతల గురించే: కళా ఎద్దేవా

రాష్ట్రంలో మద్యం, ఇసుక, భూ మాఫియా కొనసాగుతోందని రైతుల గోడును పట్టించుకునేవారు లేరని ఆలపాటి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కానీ 4,800 మద్యం షాపులు మాత్రం తెరిచారని మనిషికి మూడు మాస్కులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని.. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపుల వద్ద ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆలపాటి దుయ్యబట్టారు. మద్యం ధరలు పెంచినంత మాత్రానా సంపూర్ణ మద్యపాన నిషేధం జరగదన్న రాజేంద్రప్రసాద్, మద్యం షాపులను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు.

click me!