
స్థానిక సంస్థల్లో షాడో పెత్తనానికి చెక్ పడనుందా? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఈ షాడో పెత్తనాన్ని కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ఓ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ప్రతి ఐదేళ్ల కొకసారి జరిగే ఈ స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల పెత్తందారీ వ్యవస్థే నడుస్తోంది. పేరుకి మాత్రమే చాలా మంది పదవుల్లో ఉంటారు. కానీ వారి అధికారాలన్నీ వేరే వాళ్ల చేతిలో ఉంటాయి. వారు చెప్పినట్లు.. వీరు ఆడుతూ ఉంటారు. పదవుల్లో ఉన్న వారికి కనీస అక్షర జ్ఞానం కూడా ఉండకపోవడంతో అసలు ఏంజరుగుతుందో కూడా తెలుసుకోలేక పోతున్నారు. ఇక మీదట ఇలాంటివి జరగవు.సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఈ నిబంధనను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రానుంది.
ఎలాంటి విద్యార్హత లేకున్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఇతర ప్రజాప్రతినిధులకు లేని ప్రత్యేకాధికారమైన చెక్ పవర్ గ్రామ సర్పంచులకు ఉంది. దీంతో సర్పంచులను, ఎంపీటసీ, జడ్పీటీసీలను స్థానిక షాడో నేతలు తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటు తమ చేతుల్లో ఉంచుకునేందుకు చాలా పార్టీల నేతలు అక్షరజ్ఞానం లేని, సామాజిక అంశాల పట్ల అవగాహన లేని వారిని పోటీల్లోకి దింపుతున్నారు. గెలిచిన తర్వాత వారిని డమ్మీలుగా మార్చేస్తున్నారు.
దీంతో పాటు అభివృద్ధి నిధులు మింగేయడం, ఎదురు తిరిగిన సర్పంచుల చెక్‌పవర్‌ను అడ్డదారిలో తొలగించడం సాధారణంగా మారాయి. ఇలాంటి సమస్యలన్నింటిని అడ్డుకునేందుకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నిబంధన అమలులో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. విద్యార్హత కలిగిన స్థానిక సంస్థల పాలన మెరుగ్గా ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించింది. దీంతో దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ నివేదిక సిద్ధం చేసి.. దానిని రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కేంద్రం కోరింది. కేంద్రం పంపిన నివేదికకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.