
అసలే నోట్ల రద్దు కష్టాలతో ఇబ్బందులు పడుతున్న కేంద్రప్రభుత్వానికి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. నగదు మార్పిడి చేసుకుంటున్న ఖాతాదారుల వేళ్ళపై సిరా గుర్తులు వేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకుంటున్న ఖాతాదారులు నగదు తీసుకున్నారనేందుకు గుర్తుగా ప్రతీ ఒక్కరి వేలిపైనా సిరా గుర్తులు వేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్లుగానే నగదు మార్పిడి చేసుకుంటున్న ఖాతాదారుల వేళ్ళకు సిరా గుర్తులు వేయటం దేశవ్యాప్తంగా గురువారం నుండి మొదలైంది.
అయితే, శుక్రవారానికల్లా ఈ పద్దతిపై ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న కారణంగా ఇపుడు ఖాతాదారుల వేళ్లకు సిరా గుర్తులు వేస్తే రేపటి పోలింగ్ రోజున తమకు ఇబ్బందులు ఎదురౌతాయని ఇసి అభ్యంతరం వ్యక్తం చేసింది.
సిరా గుర్తు వేసుకున్న వ్యక్తి పోలింగ్ కు హాజరైతే తమ సిబ్బంది అయోమయంలో పడతారని ఇసి స్పష్టం చేసింది. కాబట్టి ఖాతాదారుల వేళ్ళకు సిరా గుర్తు వేసే పద్దతికి వెంటనే స్వస్తి పలకాలని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పటం గమనార్హం. సిరా గుర్తులు వేయటమన్నది దశాబ్దాల తరబడి ఎన్నికల కమీషన్ పోలింగ్ సందర్భంలో చేపడుతున్న ప్రక్రియగా ఇసి పేర్కొన్నది.