
రాజకీయ డిమాండ్లు సాధించలేరు సరే, రాష్ట్ర ప్రజలందరూ పడుతున్న అవస్తలను కూడా కేంద్రానికి గట్టిగా వినిపించలేని దుస్దితిలో చంద్రబాబు పడిపోయారా? ఇపుడు ప్రజలందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే చంద్రబాబుపై జరుగుతున్న చర్చ నిజమేనని అనుకోకతప్పదు. నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రజలు నానా అవస్తలు పడుతుంటే చంద్రబాబునాయడు ఇంకా కేంద్రానికి లేఖలు రాసే దశలోనే ఉన్నారు. రాష్ట్రప్రజలు పడుతున్న ఇబ్బందులను దృఫ్టిలో పెట్టుకుని రూ. 5 వేల కోట్లు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్రమోడికి తాజాగా ఓ లేఖ రాయటం గమనార్హం.
పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) నగదును సరఫరా చేయటం లేదన్నది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా మూడు రోజుల క్రితం అంగీకరించారు. అయితే, తాజాగా లేఖ రాస్తూ రాష్ట్రావసరాలకు తగ్గట్లుగా అదనంగా రూ. 5 వేల కోట్లను పంపాలంటూ పేర్కొనటం గమనార్హం. ప్రస్తుత పరిస్ధితుల్లో అన్నీ రాష్ట్రాలకూ సరిపడా నగదు సరఫరా చేయలేక కేంద్రమే ఇబ్బందులు పడుతోంది. ఇటువంటి సమయంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కేవలం లేఖ రాసి కూర్చోవటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ప్రజలకు అర్ధమవుతున్నదేమిటంటే కేంద్రాన్ని గట్టి ప్రశ్నించి రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా సాధించే పరిస్ధితుల్లో సిఎం లేరని. రాష్ట్రానికి రావల్సిన రూ. 6500 కోట్లలో మొన్న ఆర్బిఐ పంపిన నగదులో 4500 కోట్లు 2 వేల రూపాయల నోట్లే ఉన్నాయని సిఎం చెప్పారు. దాంతో నగదు చెలామణికి బాగా ఇబ్బందులు వస్తున్న కారణంగా రాష్ట్రానికి 500 రూపాయలు పంపాలని కోరారు. అయితే, ఆర్బిఐ సిఎం విన్నపాన్ని పట్టించుకోలేదు.
తాజాగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో రూ. 5 వేల కోట్లు విలువైన నోట్లను సరఫరా చేయాలంటూ లేఖ రాయటంపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్ర అవసరాలకు ఇబ్బందులు వచ్చినపుడు కూడా కేంద్రం ముందు కేవలం విన్నపాలతో సరిపెట్టుకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ చేస్తున్న వాళ్లకే దిక్కులేని ప్రస్తుత పరిస్ధితుల్లో చంద్రబాబు ఇంకా విన్నపాలతో కాలం నెట్టుకుస్తుండటంపై పలువురు ఆక్షేపిస్తున్నారు. ప్రజావసరాలపైన కూడా చంద్రబాబు కేంద్రం ముందు తన వాదనను గట్టిగా నిలదీయలేని దయనీయ స్ధితిలో ఉన్నారా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.