రాష్ట్ర ఈసీ రమేష్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబు వైరస్ సోకిందని పేర్ని నాని అన్నారు. అందుకే ఎన్నికలు వాయిదా వేశారని ఆయన అన్నారు.
మచిలీపట్నం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబు వైరస్ సోకినట్లుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో వారం పది రోజుల్లో ముగియనున్న ఎన్నికల షెడ్యూలుకి కరోనా సాకు చూపిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి కరోనా లేదు గానీ ఎలక్షన్ కమిషన్ కు కరోనా వైరస్ లాంటి ఏదో వైరస్ సోకిందని, అది చంద్రబాబు వైరస్ అనుకుంటానని ఆయన అన్నారు.
రమేష్ కుమార్ బాష, ఆయన మాట్లాడినవిధానం చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కు అంతుపట్టని వైరస్ సోకినట్లుందని పేర్ని నాని అన్నారు. స్థానిక సంస్థలకు ఏకగ్రీవాలు సర్వసాధారణమని ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వంలోకూడా అనేక చోట్ల జరిగాయని గుర్తు చేస్తూ మరి అప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఏమి మాట్లాడతారని అడిగారు.
Also Read: అదే సామాజిక వర్గం, రమేష్ కుమార్ వెనక చంద్రబాబు: జగన్
స్థానిక ఎన్నికలను కావాలనే వాయిదా వేశారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. ఒక్క కరోనా కేసును అడ్డం పెట్టుకుని వాయిదా వేయడం కుట్రపూరితమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన విమర్శించారు.
ఇప్పుడు ఎన్నికలు అయిపోతే రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలు వచ్చేవని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని కావాలనే హడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే స్థానిక ఎన్నికల్లోనూ వస్తాయని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా పడినంత మాత్రాన ఫలితాల్లో ఏ విధమైన మార్పులు రావని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Also Read: ఎవడో ఆర్డర్ రాస్తున్నాడు, రమేశ్ కుమార్ చదువుతున్నాడు: ఈసీపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు