ఈసీ రమేశ్ కుమార్‌ను వదిలేది లేదు.. ఎంత దూరమైనా వెళ్తాం: జగన్ హెచ్చరిక

By Siva Kodati  |  First Published Mar 15, 2020, 4:04 PM IST

ఈసీ రమేశ్ కుమార్‌ కుమార్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయనలో గనుక మార్పు రాకుంటే ఎంత దూరమైనా వెళ్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. 


ఈసీ రమేశ్ కుమార్‌ కుమార్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయనలో గనుక మార్పు రాకుంటే ఎంత దూరమైనా వెళ్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తోందని, 9 వేలకు పైగా వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారని ఈ వార్త వారికి దుర్వార్త అయ్యిందంటూ ప్రతిపక్షాలకు జగన్ మండిపడ్డారు.

దీనిని జీర్ణించుకోలేక చంద్రబాబు మరింత పడిపోతారనే ఎన్నికలు వాయిదా వేశారని సీఎం ఆరోపించారు. కరోనా వైరస్ కారణంతో ఎన్నికలను వాయిదా వేసే పరిస్ధితి ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరి సూచనలు, సలహాలు తీసుకోవాలి కదా అని జగన్ ప్రశ్నించారు.

Latest Videos

రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కానీ సమీక్షా సమావేశం కూడా నిర్వహించాల్సిన పని లేదా ముఖ్యమంత్రి నిలదీశారు. రాష్ట్రంలో హెల్త్ సెక్రటరీ కంటే సీనియర్ ఎవరైనా ఉంటారా అని సీఎం ప్రశ్నించారు.

Also Read:ఎవడో ఆర్డర్ రాస్తున్నాడు, రమేశ్ కుమార్ చదువుతున్నాడు: ఈసీపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడే ఆయనను పదవిలో పెట్టి ఉండొచ్చునని, ఇద్దరి సామాజిక వర్గాలు ఒకటే అయినంత మాత్రాన ఇంత వివిక్ష చూపడం ధర్మామేనా అని జగన్ నిలదీశారు. చంద్రబాబు అండ్ కో స్థానిక సంస్థల ఎన్నికలపై నానా యాగీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీలసు రెండు కలుపుకుంటే 10,243 చోట్ల పోటీ జరుగుతోందని, వీటిలో 54,594 నామినేషన్లు వేస్తే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2,794 వార్డులు/ డివిజన్లలో 15,185 నామినేషన్లు దాఖలు చేశారని వీటిలో కేవలం 14 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయని జగన్ తెలిపారు.

స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 4 పత్రికలు, 4 ఛానెళ్లు ఎక్కువ ఉన్నాయనో ఇంత దారుణానికి తెరదీస్తారా అని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో గొడవల పట్ల పోలీసులు ఎక్కడా ఉపేక్షించలేదని 8 చోట్ల 307 సెక్షన్ కింద కేసు పెట్టారని జగన్ స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థల్లో తనకున్న మనుషులను ఉపయోగించి ఇంతగా దిగజారాల్సిన పరిస్ధితి ఏంటన్నారు.

Also Read:స్థానిక ఎన్నికలపై ఈసీ సీరియస్: వేటు పడిన అధికారులు వీరే..

స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 31 లోపు ముగిస్తే 14వ ఆర్ధిక సంఘం విడుదల చేసే రూ. 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని, ఎన్నికలు అనుకున్న సమయానికి జరక్కపోతే నిధుల విడుదల ఆగిపోతుందని సీఎం చెప్పారు. అసలు ఆ నిధులను ఎందుకు పొగొట్టుకోవాలి, అవి వచ్చుంటే రాష్ట్రంలో ఏదో ఒక పనికి ఉపయోగించేవాళ్లమని జగన్ తెలిపారు.

తాను ముఖ్యమంత్రిగా అధికారం అందుకోలేదన్న కోపంతోనే ఇలా చేశారని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది జరగకపోతే... వచ్చే ఏడాదైనా జరుగుతాయన్న గ్యారెంటీ ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పటికప్పుడు అయిపోతే, అభివృద్ధి వైపుగా అడుగులు ముందుకు వేయవచ్చునని సీఎం తెలిపారు. 
 

click me!