
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అందుకోసమేనంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని, ఐదేళ్ల కాలంలో ఒక్కరోజును కూడా వదులుకోమని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి , ఏపీకి రావాల్సిన నిధుల గురించి చర్చించేందుకే సీఎం వైఎస్ జగన్ .. ఢిల్లీకి వెళ్లారని మిథున్ రెడ్డి చెప్పారు. నిర్ణీత గడువుకు ఒక్క రోజు ముందు కూడా తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లదని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఏపీలో మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు సాగాలని టీడీపీ, జనసేనలు భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెలలో ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అయితే సమావేశానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి.. బీజేపీ పెద్దలను కలిశారు.
ALso Read: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, షాలతో సమావేశాలు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠ..!!
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల ఏపీలో పర్యటించిన అమిత్ షా, జేపీ నడ్డాలు.. రాష్ట్రంలోని అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ అనుకూల వైఖరి కనబరుస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజును కూడా ఏపీ బీజేపీ చీఫ్‌గా తొలగించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి.. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలే కలిగి ఉంది.