
ఆంధ్రప్రదేశ్ రక్షణ చరిత్రలో మరో ఘట్టం నమోదైంది. కర్నూలు జిల్లాలో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ మిస్సైల్‌ను డ్రోన్ సహాయంతో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) నుంచి ప్రయోగించారు.
భారత సైన్యానికి అవసరమైన ఆధునిక క్షిపణి సాంకేతికతను అందించేందుకు DRDO అభివృద్ధి చేసిన UAV లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ (ULPGM-V3) ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైంది. ఈ పరీక్షలు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని NOAR కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ విజయంతో భారత రక్షణ రంగంలో ప్రెసిషన్ అటాక్ సిస్టమ్స్ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ ఆధారిత క్షిపణి సిస్టమ్ శత్రు లక్ష్యాలను దూరం నుంచే ఖచ్చితంగా టార్గెట్ చేయగలిగే శక్తి వీటి సొంతమని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదిక X ద్వారా ప్రకటించారు. స్వదేశీ టెక్నాలజీతో ఆధునిక మిస్సైల్ సిస్టమ్ రూపొందించిన DRDOతో పాటు MSMEలు, స్టార్టప్స్ సహకారాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. "ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలాన్నిస్తుంది" అని ఆయ పేర్కొన్నారు.
దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ రక్షణ రంగంలో మరో కొత్త యుగానికి నాంది పలికింది. గతంలో కూడా NOAR కేంద్రంలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ వంటి ఆధునిక ప్రాజెక్టులను పరీక్షించిన DRDO, ఈసారి మరింత ఖచ్చితమైన టెక్నాలజీతో ముందడుగు వేసింది.