
Madhav : పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (PVN Madhav)... ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తూ అదిష్టానం నిర్ణయం తీసుకుంది. మాధవ్ ఒక్కరే అధ్యక్ష పదవిరేసులో నిలిచారు... ఆయన తరపున ఐదు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలా పొటీలొ ఒక్కరే నిలిచారు కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే… అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సోమవారం నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ పూర్తిచేసి ఎక్కువమంది పోటీలో నిలిస్తే మంగళవారం ఎన్నిక జరిగేది. కానీ మాధవ్ ఒక్కరే నామినేషన్ వేశారు కాబట్టి ఆయననే అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు మాధవ్. అనంతరం బిజెపి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పివిఎన్ మాధవ్ కుటుంబం ముందునుండి బిజెపిలో ఉంది. ఆయన తండ్రి చలపతిరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుండి 1988 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. దీంతో మాధవ్ కు చిన్నప్పటినుండే బిజెపితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన ఆర్ఎస్ఎస్ తో పాటు బిజెపి యూత్ వింగ్ బిజెవైఎంలో పనిచేశారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాధవ్ రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు... శాసన మండలిలో బిజెపి ప్లోర్ లీడర్ గా కూడా చేశారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇలా బిజెపిలో వివిధ హోదాల్లో పనిచేసిన మాధవ్ పార్టీ కోసం నిబద్దతతో పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనను రాష్ట్ర అధ్యక్షుడి వరకు తీసుకెళ్లింది.
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది... టిడిపి, జనసేన పార్టీలతో కలిసి బిజెపి అధికారంలో ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూనే బిజెపిని బలోపేతం చేసుకోవాలి. ఇది మాధవ్ ముందున్న పెద్ద సవాల్ అని చెప్పాలి.
ఇక బిజెపిలోని పెద్దపెద్ద నాయకులను కాదని మాధవ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అదిష్టానం. కాబట్టి ఆయన అందరినీ కలుపుకుపోతూ ముందుకువెళ్లాల్సి ఉంటుంది. సొంతంగా బలాన్ని పెంచుకుంటూనే పార్టీ బలాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఉహించినదానికంటే మంచి ప్రదర్శన చేసింది… కూటమి పార్టీల సహకారంతో మంచి సీట్లనే సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికంటే ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించి మాధవ్ నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆయనకు పెద్ద సవాల్ అనే చెప్పాలి.