ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఇవాళ్టి నుండి డిజిటల్ పేమెంట్లకు కూడా అనుమతిచ్చింది. 11 మద్యం దుకాణాల్లో మాత్రమే డిజిటల్ పేమెంట్లకు అనుమతించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్లకు కూడా అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుండి డిజిటల్ పేమేంట్లను అనుమతించనున్నారు. రాష్ట్రంలోని 11 మద్యం ఔట్ లేఔట్లలో మాత్రమే డిజిటల్ పేమేంట్లను అమలు చేయనున్నారు. మిగిలిన మద్యం దుకాణాల్లో రానున్న మూడు మాసాల్లో డిజిటల్ పేమెంట్లకు అనుమతివ్వనున్నారు. డిజిటల్ పేమేంట్లలో భాగంగా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే కొంత అదనంగా వసూలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌బీఐ తో డిజిటల్ పేమేంట్స్ విషయమై ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమేంట్లను అనుమతించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
లిక్కర్ దుకాణాల్లో నగదు ద్వారా తప్పిదాలను నివారించేందుకు గాను డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడాదికి పైగా డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇవాళ్టి నుండి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రతి రోజూ మద్యం దుకాణాలకు వచ్చిన నగదును ఎస్ బీఐ బ్యాంకు శాఖల్లో జమ చేస్తున్నారు. మరునాడు ఈ నగదును ఎస్ బీఐ ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది.