ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగరవేయాలి.. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 2:38 PM IST
Highlights

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతిభ ఉండి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో సీట్లు సాధించి ఫీజులు కట్టలేక వెనకడుగు వేస్తున్న అర్హులందరికీ ప్రభుత్వం అండగా నిలబడుతోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్యకు అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్తులకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద మొదటి విడతో రూ. 19.95 కోట్లను సీఎం జగన్ శుక్రవారం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న పేద విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని చెప్పారు. 

పిల్లలు బాగా చదువుకోవాలని.. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని అన్నారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 125 కోట్లు, మిగిలిన విద్యార్థులకు రూ. కోటి వరకు అందిస్తామని చెప్పారు. 

‘‘మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఆ సీటుకు డబ్బులు కట్టలేకపోవడం వల్ల వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదనే ఆలోచనతో పారదర్శకమైన పద్ధతిలో బెస్ట్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ, కాలేజీలను (టాప్‌ 200 కాలేజీలను) గుర్తించాం. వాటి జాబితాను ప్రదర్శించడం జరుగుతుంది. బెస్ట్‌ యూనివర్సిటీ, కాలేజీల్లో మన పిల్లలకు సీటు వస్తే పారదర్శకంగా వారికి సపోర్ట్‌ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

గతంలో ఉన్న పథకాలన్నీ అధ్యయనం చేశాం.. అవి కేవలం పేరుకు మాత్రమే  ఉన్నాయి. కేవలం రూ.10 లక్షలు, ఎస్టీ, ఎస్సీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈ డబ్బుతో విద్యార్థులకు మంచి జరగదు.. వారిలోని స్థైర్యాన్ని నీరుగార్చేలా గత ప్రభుత్వాలు ప్రవర్తించాయి. 2016–17లో విదేశీ విద్య అభ్యసిస్తున్న పిల్లలకు డబ్బులు రూ.300 కోట్లు బకాయిలుగా పెట్టడంతో ఆ పథకమే పూర్తిగా నీరుగారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కేవలం కొందరికి మాత్రమే చెత్త యూనివర్సిటీల్లో సీటు వచ్చినా సపోర్టు చేశారు. ఒక వ్యవస్థలో మంచి చేయాలనే తపన అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి నుంచి.. మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిస్థితులన్నీ మార్చాలనే తపన, తాపత్రయం నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది’’ అని సీఎం జగన్ తెలిపారు. 
 

click me!