’నంది‘ ని ప్రభుత్వం నిలిపేస్తుందా ?

First Published Nov 20, 2017, 7:56 AM IST
Highlights
  • నందిఅవార్డుల ప్రధానాన్ని సమర్ధించుకోలేని ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది.
  • నంది అవార్డులను ఇదే విధంగా వివాదాస్పదం చేస్తే అసలు అవార్డులనే నిలిపేస్తామంటూ ఫీలర్లు వదులుతోంది

నంది అవార్డుల ప్రధానాన్ని సమర్ధించుకోలేని ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. నంది అవార్డులను ఇదే విధంగా వివాదాస్పదం చేస్తే అసలు అవార్డులనే నిలిపేస్తామంటూ ఫీలర్లు వదులుతోంది. ప్రభుత్వ వర్గాలను ప్రస్తావిస్తూ ఓ పచ్చ పత్రిక ఈ విషయాన్ని బ్యానర్ కథనంగా ప్రచురించింది. ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు ఏకంగా 9 అవార్డులు రావటంతోనే వివాదాలు మొదలయ్యాయి. అవార్డుల ఎంపిక కమిటీలో సభ్యుడు, చంద్రబాబునాయుడు బావమరది కాబట్టే లెజెండ్ సినిమాకు అన్ని అవార్డలు ఇచ్చారంటూ రచ్చ జరుగుతోంది. ఏదేమైనా అవార్డులకు ఎంపికన చూస్తే సామాజిక వర్గాలు, బంధుత్వాలు, అవసరాలకే పెద్ద పీట వేసినట్లు అనుమానమొస్తుంది.   

రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వకపోవటాన్ని దర్శకుడు గుణశేఖర్ ఎప్పటి నుండో ప్రభుత్వంపై మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు ఇపుడు అవార్డు కూడా రాకపోవటమే కాకుండా లెజెండ్ కు అన్ని అవార్డులు ఇవ్వటాన్ని పెద్ద వివాదం చేసారు. దాంతో బాలకృష్ణ మద్దతుదారులు, గుణశేఖర్ మద్దతుదారులు కొద్ది రోజులుగా మీడియా ముఖంగా ఒకరిపై మరొకరు తీవ్రస్ధాయిలో విమర్శలు చేసుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే.  దాంతో నంది అవార్డు స్ధాయే దిగజారిపోయింది. చివరకు విమర్శలు కమ్మ-కాపు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది.

అదే విషయాన్ని పచ్చపత్రిక ప్రస్తావిస్తూ విమర్శలు, ఆరోపణలు నంది అవార్డులను కించపరిచేలా ఉన్నాయని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఉన్నందు వల్ల అసలు అవార్డలనే నిలిపేస్తామని ప్రభుత్వ వర్గాలను ఉదహరిస్తూ పెద్ద కథనాన్ని ప్రచురించింది. కథనం ప్రకారం, అసలు తెలుగుసినిమా పరిశ్రమ హైదరాబాద్ ను వదిలి రాలేదన్న ఆక్రోసం ఉంది. పరిశ్రమ కట్టే పన్నులు కూడా తెలంగాణా ప్రభుత్వానికే వెళుతోందట. అవార్డలు అందుకున్న వాళ్ళల్లో చాలామందికి ఏపిలో అసలు ఓటు హక్కు కూడా లేదట. ఏదో తెలుగువారంతా ఒకటే అన్న ఉద్దేశ్యంతో పొరుగు రాష్ట్రం వారికి కూడా అవార్డులు ఇస్తున్నామంటూ ప్రభుత్వ వర్గాలు చెప్పాయట.

విచిత్రంగా లేదూ ప్రభుత్వ వాదన? సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుండి ఏపికి రాలేదన్న విషయం ఇపుడే గుర్తుకువచ్చిందా ? వారిలో చాలామందికి ఓటుహక్కు కూడా లేదన్న విషయం ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసింది?  ఓటుహక్కుకు ఉత్తమ చిత్రాల అవార్డుల ఎంపికకు ఏంటి సంబంధం? ఆమాట కొస్తే, చంద్రబాబునాయుడుకు కూడా ఓటుహక్కు తెలంగాణాలోనే ఉందంటూ ఆమధ్య వైసీపీ ఆరోపణలు చేయలేదా? ఏకపక్షంగా అవార్డులు ఇచ్చుకున్న విషయం బయటపడేటప్పటికీ తన చర్యలను సమర్ధించుకునేందుకు ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది.

click me!