శిలాఫలకాలను తెలుగులో రాయండయ్యా

First Published Nov 4, 2016, 12:07 PM IST
Highlights

శిలాఫలకాలను, కార్యాలయాల బోర్డులను తెలుగు రాయండని ఉపసభాపతి బుద్ధ ప్రసాద్ కోరుతున్నారు

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా వాడే శిలాఫలకాలతో పాటు  కార్యాలయాల బోర్డులన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ ఆర్జీల కమిటీ ఛైర్మన్‌, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆదేశించారు.

 

ఈ రోజు విజయవాడలో జరిగిన  శాసనసభ ఆర్జీల కమిటీ సమావేశానికి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షత వహించారు. తెలుగు అధికార భాషగా అమలవుతున్న  తీరుమీద మాట్లాడుతూ

 

పాలనా వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశానికి వచ్చిన ఉన్నతాధికారులను బుద్ధ ప్రసాద్ ఆదేశించారు.శాసనసభ చేసిన చట్టాన్ని అధికార భాషా చట్టాన్ని గౌరవిస్తూ తెలుగు అధికార భాషగా తప్పనిసరిగా అమలు జరిపేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

పాలనా కార్యకలాపాలు ప్రజల భాషలో  సాగినప్పుడే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సామాన్యులు, గ్రామీణులు తెలుసుకోగలుగుతారు, వాటిని వినియోగించుకోవగలుతారు అని ఆయన అన్నారు.

 

అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కార్యాలయాలు, విద్యాలయాలు, న్యాయస్థానాల్లో తెలుగుభాషను తప్పనిసరిగా అమలు చేయడం అసాధ్యమేమీ కాదని అన్నారు. కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పలువురు శాసన సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

click me!