
విశాఖను తూర్పుతీర గోవాగా మార్చేందుకు రాష్ట్రం తలపెడుతోందని చెబుతున్న “బీచ్ లవ్ ఫెస్టివల్” వివాదాస్పదమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వేల సంఖ్యలో విదేశీ జంటల రోమాన్స్ కు విశాఖ బీచ్ ను కేంద్రం చేసి, ముందు ముందు మరొక గోవాగా విశాఖ పట్టణాన్ని మార్చి పర్యాటకులను, పెట్టుబడులను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆశగా చూస్తున్నది.
మామూలుగానే ముఖ్యమంత్రి నైట్ లైఫ్ ను బాగా ఇష్ట పడతారు. అమరావతిని రూపకల్పనలో నైట్ లైఫ్ చాలా ప్రాముఖ్య మిస్తున్నట్లు ఆయన చాలా సార్లు చెప్పారు. ఫారిన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు అలసి పోయి నపుడు సేద దీరెందుకు వీలుగా అమరావతి ఉండాలని ఆయన ఎన్నో సార్లు చెప్పారు.ఆంధ్రకు విపరీతంగా ఇన్వెస్టర్లొచ్చే వీలుంది కాబట్టి వైజాగ్ బీచ్ ని కూడా ప్రయివేటు ఏజన్సీల సహకారంతో వాళ్లకి అనుకూలంగా మార్చాలన్న భారీ ఆలోచన ఆయనకు వచ్చింది. బీచ్ లవ్ ఫెస్టివల్ తో ఇన్వెస్టర్లు పరిగెత్తుకొచ్చే అవకాశముంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఇపుడు నిర్వహిస్తున్న ఈ లవ్ ఫెస్టివల్ కు బిజెపి నుంచి ఏ మాత్రం వ్యతిరేకత రావడం లేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా రోడ్ల మీద జంటగా కనిపించిన వాళ్లందరికి తాళిబొట్టు అందించి పెళ్లి చేసే అచారం పెట్టుకున్న సంస్థలేవీ విశాఖ బీచ్ ప్రణయ పర్వం గురించి పట్టించుకొనక పోవడం ఆశ్యర్యం.
అయితే, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్, ఇతర మహిళా సంఘాలు మాత్రం బీచ్ శృంగారాన్ని రభస చేసందుకు సిద్ధమవుతున్నాయి. పార్టీ శాసన సభ్యురాలు రోజా, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి దీనిని ఆంధ్ర మనోభావాలకు వ్యతిరేకమయిన రోత అని స్పష్టంచేశారు. అయితే, పోలీసులను కాపలాపెట్టయినా ఆంధ్రాతీరాన విదేశీ శృంగారం నిరాటంకంగా మూడు రోజుల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం కూడా సిధ్దమవుతున్నది.
బీచ్ ప్రేమ పండగ లో పాల్గొనే జంటల కోసం ప్రత్యేకంగా రంగు రుంగల గుడారాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విదేశీజంటలు తెలుగు బీచ్ లో ఎలా ప్రేమించుకుంటారో తొంగి చూసేందుకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూల నుండి తెలుగు జనం విరగబడే అవకాశం ఉన్నందున టికెట్ పెట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారట.
చంద్రబాబుతోపాటు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ, బీచ్ లవ్ ఫెస్టివల్‌పై తన వైఖరేంటో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లకు, యాత్రికులకు కూడా విశాఖను చల్లని వెచ్చని విడిది చేయాలనుకుంటున్నారు. దీనికోసం ప్రయోగాత్మకంగా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు మూడు రోజులపాటు విశాఖ బీచ్ లో ప్రేమ పండగను నిర్వహించబోతున్నారు.
ఈ పెస్టివల్ లో ఓలలాడేందుకు అమెరికా, ఐరోపా నుంచి దాదాపు 9వేల జంటలను ఆహ్వానిస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ తారలు ఆటపాటలతో హోరెత్తించనున్నారు.కొలంబియా పాప్ సింగర్ షకీరా బీచ్ లవ్ ఫెస్టివల్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబై కంపెనీ పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ కన్సెల్టెన్సీ బీచ్ లవ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నది.
బీచ్ లవ్ ఫెస్టివల్ లో పాల్గొనే జంటల కోసం ప్రత్యేకంగా రంగు రుంగల గుడారాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విదేశీజంటలు తమ బీచ్ ఎలా ప్రేమించుకుంటారో తొంగి చూసేందుకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూల నుండి తెలుగు జనం విరగబడే అవకాశం ఉన్నందున టికెట్ పెట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారట.
అయితే, ఇది చంద్రబాబు నాయుడి విదేశీ వ్యామోహానికి పరాకాష్టగా చెబుతున్న పార్టీలు ప్రజాసంఘాలు మాత్రం ఈ ప్రణయ పర్వాన్ని రోత అని చీదరించుకుంటున్నాయి. ఇది తెలుగు సంస్కృతికి వ్యతిరేకమని , విదేశీపర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇలా బికినీ ఫెస్టివల్ ను ఏర్పాటుచేయాలనుకోవడం దివాళకోరుతనమని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శిస్తున్నారు.
తెలుగుదేశం అనుబంధం ఉన్న బిజెపి మౌనంగా ఉండటంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆ పార్టీ పాత్ర పోషించి బీచ్ లో విదేశీ శృంగారం జరగనీయమని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నది. ఈ బికిని పండగతో విశాఖ కు ఉన్న మంచిపేరు మసకబారుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ లోపు ప్రభుత్వం ప్రతినిధులు, ముంబై కి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ కన్సెల్టెన్సీ ప్రతినిధుల బీచ్ లవ్ ఫెస్టివల్ కు తొట్లకొండ, సాగర్ నగర్ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు అనువైన ప్రాంతాలని గుర్తించారు.
బీచ్ లో ’ప్రేమ పండగ’ నిజం కాదు - ప్రభుత్వం
విశాఖపట్నంలో బీచ్ లవ్, ప్రేమోత్సవం పేరుతో రాష్ట్రం ప్రభుత్వ సారధ్యంలో విశృంఖలమైన ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ పత్రికల్లో వస్తున్న వరుస కథనాలను పర్యాటక-పురపాలక శాఖలు తోసిపుచ్చాయి. మొత్తం 9 వేల విదేశీ జంటలతో ప్రేమ పేరుతో విష సంస్కృతిని విశాఖలో చొప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. పత్రికలు పేర్కొన్నట్టుగా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు విశాఖలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో ఎటువంటి ప్రైవేట్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఫిబ్రవరిలో విశాఖతీరంలో వేడుకలా ఒక కార్యక్రమం నిర్వహిస్తామని ఓ ప్రైవేట్ ఏజెన్సీ సంప్రదించిన మాట వాస్తవేమని, అయితే ఆ కార్యక్రమానికి పేరును కానీ, వేడుకకు సంబంధించి పూర్తి వివరాలను కానీ ఏజెన్సీ వెల్లడించలేదని పర్యాటక-పురపాలక శాఖలు పేర్కొన్నాయి. ఆ ప్రైవేట్ ఏజెన్సీ వినతిపై అనుమతి ఇవ్వాలా, వద్దా అనేదాని కోసం విశాఖ జిల్లా కలెక్టర్, వుడా వైస్ చైర్మన్, మున్సిపల్ శాఖ కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌తో కూడిన నలుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు వెల్లడించాయి. దీనిపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇంతలోనే తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను ప్రభుత్వం మంటగలుపుతున్నట్టుగా, స్వయంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్టుగా కథనాలు రాయడం, విశాఖ బీచ్‌లో విదేశాల నుంచి వచ్చే జంటజంటకూ ఓ టెంట్ వేస్తున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అధికారవర్గాలు ఒక ప్రకటనలో హితవు పలికాయి.