
తెలంగాణాలో ఉన్న ముగ్గురు టిడిపి ఎంఎల్ఏల్లో ఆర్. కృష్ణయ్య టిటిడిఎల్పీ శాసనసభాపక్ష నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కు పెద్ద షాకే ఇవ్వనున్నారు. గురువారం రేవంత్ ఆధ్వర్యంలో జరగుతుంది అనుకుంటున్న శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాకూడదని కృష్ణయ్య నిర్ణయించుకున్నారు. అంటే ఉన్న ముగ్గురిలో ఒకరి మద్దతును రేవంత్ కోల్పోయినట్లే. మిగిలిన సండ్ర వెంకటవీరయ్య వ్యవహారం ఇంకా తేలలేదు.
గడచిన పది రోజులుగా రేవంత్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలకు ఈరోజు క్లైమ్యాక్స్ పడనుంది. ఎలాగంటే, 11 గంటలకు టిటిడిఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. అయితే, రేవంత్ టిటిడిఎల్పీ సమావేశం నిర్వహించేందుకు లేదని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ హూంకరిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలు లేనిదే రమణ అంతలా మాట్లాడలేరన్న విషయం తెలిసిందే.
వారిద్దరి మధ్య ఇలా వివాదం నడుస్తుండగానే భారతీయ జనతా పార్టీ, టిటిడిపి కలిసి శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయటానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రమణ చెబుతున్నారు. ఇక్కడే టిడిపి ఎంఎల్ఏలకు సమస్య వచ్చిపడింది. ఒకవైపు రేవంత్ మరోవైపు రమణలు సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.
టిటిడిఎల్పీలో ఉన్నదే ముగ్గురు సభ్యులు. అందులో రేవంత్ శాసనసభాపక్ష నేత. రేవంత్ ను తీసేస్తే మిగిలింది ఇద్దరే. ఒకరు సండ్ర వెంకటవీరయ్య, ఇంకోరు ఆర్ కృష్ణయ్య. ఇపుడు వీరిద్దరు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదే విషయమై కృష్ణయ్య ‘ఏషియా నెట్’ తో మాట్లాడుతూ తాను రమణ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరవుతానని చెప్పారు. రేవంత్ నుండి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదు కాబట్టి దాని గురించి ఆలోచించటం లేదని స్పష్టం చేసారు.
రేవంత్ టిటిడిఎల్పీని చీల్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం తన దృష్టికి రాలేదన్నారు. అదే విధంగా టిటిడిఎల్పీ శాసనసభా పక్ష నేతగా తనను నియమించే అవకాశం గురించి ప్రస్తావిస్తూ రమణ నిర్వహించే సమావేశంలో ప్రతిపాదన ఏమైనా వస్తుందేమో అని అన్నారు. ఇప్పటి వరకూ తన వద్ద ఎవరూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. టిటిడిఎల్పీ సమావేశం నిర్వహిస్తానని అంత గట్టిగా చెబుతున్న రేవంత్ మరి ఆర్ కృష్ణయ్యను ఎందుకు ఆహ్వనించకుండా ఎందుకుంటారబ్బా ?