
‘‘వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ కలుపు మొక్క’’...‘‘కలుపు మొక్కను ఎవరూ దగ్గరకు తీసుకోరు’’....ఇది ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్య. కడపలో మీడియాతో మాట్లాడుతూ, కలుపు మొక్కలాంటి జగన్ ను ఎవరైనా దగ్గరకు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి దగ్గరవ్వటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఉపయోగం లేనివన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా భాజపా, టిడిపిలు కలిసే పనిచేస్తాయన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని మంత్రి హెచ్చరించారు.
అధికారంలో ఉన్నపుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రూ. 10 లక్షల కోట్ల అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ధ్వజమెత్తారు. జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదని, పార్టీ జెండా పీకేయటం కూడా ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాయలసీమకు నీళ్ళివ్వటానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే జగన్ కు ఇష్టం లేదని మంత్రి ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని పలు పథకాలను కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.