ఒకే కూతుర్నని చెప్పి.. తల్లి ఆస్తులమ్ముకున్న ఖతర్నాక్ లేడీ..

By AN TeluguFirst Published Feb 24, 2021, 10:32 AM IST
Highlights

కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్లను మోసం చేసి ఆస్తులు అమ్ముకుందామని చూసిందో కిలాడీ లేడీ.. తన తల్లికి తాను ఒక్కదాన్నే సంతానం అని చెప్పి అధికారులను బురిడీ కొట్టించింది. కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను ఒక్కతే అమ్మేసుకుంది. ఈ ఉదంతం నంద్యాలలో వెలుగుచూసింది. 

కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్లను మోసం చేసి ఆస్తులు అమ్ముకుందామని చూసిందో కిలాడీ లేడీ.. తన తల్లికి తాను ఒక్కదాన్నే సంతానం అని చెప్పి అధికారులను బురిడీ కొట్టించింది. కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను ఒక్కతే అమ్మేసుకుంది. ఈ ఉదంతం నంద్యాలలో వెలుగుచూసింది. 

విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. టూటౌన్‌ ఎస్‌ఐ పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని కోటావీధికి చెందిన అవుకు రమాదేవి అనే మహిళ తన తల్లి ఎల్ల నర్సమ్మకు తాను ఏకైక సంతానమని, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందింది. 

అంతేకాదు ఈ సర్టిఫికెట్‌ను చూపించి తన తల్లికి చెందిన ఆస్తులను ఇతరులకు అమ్మేసి, రిజిస్ట్రేషన్లు‌ చేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. ఏదో అనుమానంతో కనిపెడితే.. నర్సమ్మకు రమాదేవితో పాటు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నట్టు తేలింది.  

ఈ విషయాన్ని దాచిపెట్టి తానొక్కతే లాభపడాలని చూసింది. ఈ విసయం దాచి పెట్టి భూములను రిజిస్ట్రేషన్లు‌ చేసిన విషయం తహసీల్దార్‌కు తెలియడంతో గత నవంబర్ లో రమాదేవిని పిలిపించి విచారించారు.  

ఈ విచారణలో రమాదేవి తనకు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నది నిజమేనని ఒప్పుకుంది. అంతేకాదు తను ఒక్కతే కూతుర్నని జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ రద్దు చేయమని రాత పూర్వకంగా రాసి ఇచ్చింది. 

అయితే ఇక్కడితో రమాదేవి తన ఆలోచనను ఆపేయలేదు.. ఆ తరువాత కూడా ఒక్కతే కూతుర్ననే ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన మాదిరెడ్డి తిరుమలేశ్వరరెడ్డి, చిట్టెపు మద్దిలేటిరెడ్డి, బనగానపల్లెకు చెందిన వెంకట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ బీఐ కాలనీకి చెందిన సీతారామిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డిలకు  డిసెంబర్ 30న విలువైన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. 

ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవికుమార్, రమాదేవి తప్పుడు సర్టిఫికెట్ తో  రిజిస్ట్రేషన్లు చేస్తుందని ఆమెపై కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మాయ కన్నింగ్ కూతురిపై ఐపీసీ సెక్షన్ 177, 182, 199, 420, 419 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వీరయ్య తెలిపారు.

click me!