కేసుల భయంతోనే జగన్ ఎన్డీఏకి మద్దతు

First Published May 10, 2017, 11:29 AM IST
Highlights

కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుని ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు పలికినట్లు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఎద్దేవా చేసారు.

కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుని ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు పలికినట్లు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఎద్దేవా చేసారు. ఈరోజు ఉదయం జగన్ ప్రధానిని కలిసి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా? అదే విషయమై దేవినేని మీడియాతో మాట్లాడుతూ, తనపైనున్న కేసుల నుండి బయటపడేందుకే జగన్ ఎన్డీఏకి మద్దుతుపలికారంటూ ఆరోపించారు. ప్రత్యేకహోదా, భూసేకరణ విషయంలో తప్ప మిగిలిన అన్నీ విషయాల్లోనూ జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికినట్లే అని చెప్పారు.

కేంద్రంలో మావాళ్ళు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ భాజపా వాళ్లు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అయినా జగన్ ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన తర్వాత ఏ మొహం పెట్టుకుని జగన్ మీడియా ముందుకు వచ్చారంటూ దేవినేని నిలదీసారు.

పార్లమెంట్ సమావేశాలు అవగానే తన ఎంపిలతో రాజీనామాలు చేయిస్తానని ప్రకటించిన జగన్ తన ఎంపిలతో మోడి కాళ్లమీద పడటంలో అర్ధం ఏమిటంటూ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా మధ్యలోనే సభ నుండి వెళ్లిపోయారని గుర్తుచేసారు.

మిర్చి రైతులకు కేంద్రం రూ. 5 వేలు ప్రకటించటం హర్షణీయమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్ కు లేదని మంత్రి తేల్చేసారు. తాము భాజపాతో కలిసినపుడు మతతత్వ పార్టీ అని ముద్రవేసిన జగన్ ఇపుడు అదే భాజపాకి ఎలా మద్దతు ప్రకటించారని నిలదీసారు.

జగన్ కళ్ళ ముందు జైలు ఊచలు కనిపిస్తున్నాయని, అందుకే విజయసాయిరెడ్డని వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్ళారంటూ మంత్రి చెప్పారు. వ్యక్తిగత కేసుల నుండి బయటపడేందుకే జగన్ తెల్ల జెండాను ఎగురవేసినట్లుగా మంత్రి వ్యాఖ్యానించారు. ఎందుకంటే, ఈరోజు జగన్ కళ్ళలో కనిపించిన ఆనందం గతంలో ఎన్నడూ కనిపించలేదని మంత్రి చెప్పటం గమనార్హం.

ఎన్డీఏకి జగన్ మద్దతు పలికిన గంటలోనే వైసీపీ ఎంఎల్ఏలు కొందరు తమతో టచ్ లోకి వచ్చినట్లు దేవినేని చెప్పటం విశేషం. 2014లో భాజపాతో కలిసి పోటీ చేసామని, 2019లో కూడా కలిసే పోటీ చేస్తామంటూ ఉమ తేల్చిచెప్పారు. ఎన్డీఏకి జగన్ మద్దతు పలకటంతో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా పోస్టు ఖాళీ అయిపోయిందన్నారు.

click me!