
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షపాతం నమోదవుతోంది. ఈ తుఫాను మరింత తీవ్రరూపం దాలుస్తూ తీరంవైపు దూసుకువస్తుండటం భయాందోళన కలిగిస్తోంది.
ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య మిచౌంగ్ తుఫాను తీరందాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో ఈ తుఫాను తీరందాటవచ్చని భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసారు అధికారులు. తుఫాను తీవ్రత మరీ ఎక్కవగా వుండే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
తీవ్ర తుఫానుగా మారిన మిచౌంగ్ ప్రస్తుతం నెల్లూరుకు కేవలం 20 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
Also Read School Holidays: విద్యార్థులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు..
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఇక ఏపీలోని మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలపైనా మిచౌంగ్ తుఫాను ప్రభావం వుండనుంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీచేసారు.
మిచౌంగ్ తుఫాను కారణంగా మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదయ్యే ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీచేసారు.