
ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్ తుపాన్ (Cyclone Jawad) ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారనుంది. అది.. డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు చేరుకుని మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా.. దక్షిణ ఒడిశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఈ క్రమంలోనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. డిసెంబర్ 3,4 తేదీల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. వీటిలో పూరి- తిరుపతి, హౌరా-హైదరాబాద్, భువనేశ్వర్- సికింద్రాబాద్, రాయగడ- గుంటూరు, హౌరా- సికింద్రాబాద్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి జాబితాను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు తుపాన్ నేపథ్యంలో East Coast Railway కూడా పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
ఇక, తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర (North Coastal Andhra pradesh), దక్షిణ ఒడిశా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే డిసెంబర్ 2 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.. డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.