విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపే శక్తి... జగన్, విజయసాయిలకు మాత్రమే: సిపిఐ రామకృష్ణ

By Arun Kumar PFirst Published Feb 25, 2021, 2:47 PM IST
Highlights

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం అధికారులతో కమిటీ వేయడమే కాదు అంచనాలు కూడా సిద్దం చేస్తున్నారని సిపిఐ రామకృష్ణ తెలిపారు. 

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ‌ ప్రకటనతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఖాయమని తేలిపోయిందని సిపిఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. అసలు ప్రకటనే రాకుండా ఎలా నిందిస్తారంటూ ఇప్పటివరకు మాట్లాడిన రాష్ట్ర బిజెపి నాయకులు ఇకనైనా స్పందించాలని... కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని అందరూ కలిసి కాపాడుకోవాలని రామకృష్ణ సూచించారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం అధికారులతో కమిటీ వేయడమే కాదు అంచనాలు కూడా సిద్దం చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. సోము వీర్రాజు, జీవియల్ కు సిగ్గుంటే బిజెపికి రాజీనామా చేయాలని మండిపడ్డారు. కనీసం ప్రధాని అపాయింట్మెంట్ కూడా పొందలేని ఆ పదవుల్లో మీరెందుకు అని విమర్శించారు. ఇంత జరుగుతుంటే కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురారు అని నిలదీశారు. 

''ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి లకు మాత్రమే ఉంది. కానీ కార్పొరేటర్లను ఏకగ్రీవం చేస్తానంటూ విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్రలు చేస్తున్నారు. ఇక జగన్ అయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ఎనభై శాతానికి పైగా వైసిపి గెలుచుకోవాలని పోలీసులతో బెదిరిస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more   విశాఖ ఉక్కు ప్లాంట్ కు కేంద్రం షాక్: మోడీ చెప్పింది అదే...

''ఏపీకి జగన్, విజయసాయి అఘోరాల్లాగా తయారయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే మీకు సమాధులు కట్టడం ఖాయం. అరుంధతిలో అఘోరాకు కట్టిన సమాధి కంటే బలంగా వీరిద్దరికి సమాధులు కడతారు'' అని విరుచుకుపడ్డారు.

''రేపు(శుక్రవారం) భారత్ బంద్ కు సిపిఐ మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని పెట్రో ధరలు మన దేశంలోనే ఎందుకు? ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నా మోడీ స్పందించరా? అన్ని‌వర్గాల‌వారు రోడ్డు ఎక్కుతామన్నా కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. గ్యాస్ ధరలు ఈ ఒక్క నెలలోనే మూడు సార్లు పెంచారు.వీటిని నిరసిస్తూ సిపిఐ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొంటున్నాం'' అని రామకృష్ణ తెలిపారు. 
 

click me!