జెసికి సంపాదన తక్కువైందట

First Published Jun 11, 2017, 10:51 AM IST
Highlights

ఎటువంటి సమస్య లేకపోయినా, ఫిర్యాదులు లేకపోయినా ఇపుడున్న కార్యాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటంటూ కోర్టు నిలదీసింది. ఎంపి లేఖ రాయటమేంటి? వెంటనే అనుకూలంగా నిర్ణయం తీసుకోవటమేంటంటూ ఉన్నతాధికారులకూ తలంటిపోసింది.

పాపం అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి సంపాదన సరిపోతున్నట్లు లేదు. అందుకనే బలవంతంగా ప్రభుత్వ కార్యాలయాలను తాను నిర్మిస్తున్న వాణిజ్య సముదాయంలోకి తరలించాలనుకున్నారు. అయితే, న్యాయస్ధానం బ్రేకులు వేసింది లేండి. ఇంతకీ విషయమేమిటంటే, అనంతపురంలో వాణిజ్య పన్నులశాఖ డిప్యూటి కమీషనర్ కార్యాలయం ఉంది. కార్యాలయం ఉన్న ప్రాంతం జనాలందరికీ అందుబాటులోనే ఉంది. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు.

అయితే, కార్యాలయాన్ని కొత్తగా నిర్మిస్తున్న ఓ వాణిజ్య సముదాయంలోకి మార్చాలని వాణిజ్య పన్నులశాఖ నిర్ణయించింది. కార్యాలయాన్ని ఎందుకు తరలించాలని హటాత్తుగా నిర్ణయించారో ఎవరికీ తెలీదు. ఇంతలో ఈ విషయమై ఆరా తీసిన ఎవరో వాస్తవాలు తెలుసుకుని న్యాయస్ధానంలో కేసు వేసారు. దాంతో వివాదం కోర్టు మెట్లెక్కింది.

ఇంతకీ విషయమేంటంటే, జెసి అనంతపురంలో కొత్తగా వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఎవరికో అద్దెకు ఇచ్చేకన్నా ప్రభుత్వ కార్యాలయానికే అద్దెకు ఇస్తే లాభముంటుందని అనుకున్నారు. ప్రైవేటు వ్యక్తులైతే తాను చెప్పినంత అద్దెకు దిగుతారో లేదో తెలీదు. అదే ప్రభుత్వ కార్యాలయమైతే మ్యానేజ్ చేసుకోవచ్చు. అందుకనే వెంటనే వాణిజ్య పన్నులశాఖకు లేఖ రాసారు. అధికార పార్టీ ఎంపి కదా చకచక ఫైలు సానుకూలంగా పరుగెత్తింది. వెంటనే అద్దెలు, అడ్వాన్సులు కూడా నిర్ణయమైపోయింది. ఇంకేముంది కార్యాలయాన్ని మార్చేస్తున్నట్లు వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది.

ఎప్పుడైతే విషయం బహిర్గతమైందే ఎవరో న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. వెంటనే కోర్టు కూడా స్పందించింది. ఎటువంటి సమస్య లేకపోయినా, ఫిర్యాదులు లేకపోయినా ఇపుడున్న కార్యాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటంటూ కోర్టు నిలదీసింది. ఎంపి లేఖ రాయటమేంటి? వెంటనే అనుకూలంగా నిర్ణయం తీసుకోవటమేంటంటూ ఉన్నతాధికారులకూ తలంటిపోసింది. పైగా కార్యలయాన్ని 10 ఏళ్ళు అద్దెకు తీసుకుంటున్న ఉన్నతాధికారులు సదరు కార్యాలయానికి అద్దె ఎంత? అడ్వాన్స్ ఎంత? అన్న విషయాలు మాత్రం బహిర్గత పరచలేదు.

click me!