
మూడేళ్ళ చంద్రబాబునాయుడు పాలనపై రాష్ట్రంలోని ఏ వర్గంలోనూ పెద్దగా సంతృప్తి లేదు. ఆ విషయాన్ని జనాలు, ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు, విమర్శల రూపంలో చెబుతూనే ఉన్నాయి. అయినా చంద్రబాబు ఏనాడూ ఖాతరు చేయలేదు. సంపాదనకు టిడిపి నేతలు యధేచ్చగా లాకులెత్తేసారు. పాలనా అంశాలపై చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ ఉత్త డొల్లే అన్న విషయం ఎప్పుడో స్పష్టమైపోయింది. ఎందుకంటే, చంద్రబాబు చెపుతున్న మాటలకు, మంత్రులు, ఎంఎల్ఏ, నేతల చేతలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. నేతల సంపాదన మార్గాలు చంద్రబాబుకు తెలియకుండా, అనుమతి లేకుండానే ఉంటుందా?
చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దందాలు పూర్తిస్ధాయిలో వెలుగు చూడటం లేదంటే టిడిపికి ఒక వర్గం మీడియా మద్దతుగా నిలవటమే కారణం. అటువంటిది ఆ మీడియాలో కూడా ఇపుడు చంద్రబాబు పాలన గురించి ఏదో రూపంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నట్లు ఆరోపణ, విమర్శల రూపంలో కాకుండా సూచనలు, సలహాల రూపంలో ఉంటున్నాయ్.
ఆంధ్రజ్యోతిలో వచ్చినదాని ప్రకారమే రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఢిల్లీ స్ధాయిలో అభిప్రాయం వచ్చేసిందట. కొంతమంది మంత్రుల పిల్లలు సిండికేట్ గా ఏర్పడి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారట. భాజపా చేయించిన సర్వేలో 43 శాతం జనాలు చంద్రబాబుకు జై కొట్టారట. అంటే మిగిలిన 57 శాతం మంది జనాలు వ్యతిరేకమనే కదా అర్ధం. చంద్రబాబుకు జై కొట్టిన జనాలే మళ్ళీ ఎంఎల్ఏలపై విపరీతమైన వ్యతిరేకత కనబరిచారట. సర్వే వివరాలను భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఎంకు వివరించారట. నేతలు విచ్చలవిడిగా సంపాదించుకుంటూ అందుకు లోకేష్ పేరు వాడుకుంటున్నట్లు చెప్పటం గమనార్హం.